హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి డీజీపీ శివధర్‌రెడ్డిని కోరారు. తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో డీజీపీని కలిసి విజ్ఞప్తిచేశారు. 20 19-2024లో సర్పంచులుగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు నిర్వహించినట్టు లక్ష్మీనర్సింహారెడ్డి గుర్తుచేశారు.
రూ.1,200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని, బిల్లులు అందక ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీజీపీకి వివరించారు. 20 నెలలు అవుతున్నా.. బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యు డు పత్యానాయక్, ముథోల్ మాజీ సర్పంచ్ రాజేందర్, వరికుప్పల గణేశ్ పాల్గొన్నారు.