మక్తల్, అక్టోబర్ 16: నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో కొందరికి పురుగులు వచ్చాయి. దీంతో భోజనం పారేసి ఆకలితో అలమటించారు. ఇలాంటి అన్నం తినలేమంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
తహసీల్దార్ సతీశ్ పాఠశాలకు చేరుకొని భోజనాన్ని పరిశీలించగా.. పురుగులు ఉన్న విషయం వాస్తవమే అని నిర్ధారించారు. డీఈవో గోవిందరాజులు బియ్యాన్ని పరిశీలించారు. పురుగులు అధికంగా ఉన్నాయని, నాణ్యత ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చి వండిస్తామని చెప్పారు.
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు దాహార్తిని తీర్చాలంటూ గురువారం రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజన సమయంలో తాగునీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంపీడీవో చెన్నయ్య, ఎంఈవో వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ హెచ్ఎం నల్లారెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పారు. స్కావెంజర్ దురుద్దేశంతోనే పాఠశాలకు నీళ్లు సరఫరా కాకుండా చేశాడని వారు మండిపడ్డారు.
-గట్టు