హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లను (BC Reservations) రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తీరుపై బీసీలు రగిలిపోతున్నారు. రిజర్వేషన్ల అమలు విషయంలో సర్కారు అపసవ్య ధోరణిలో వెళ్తున్నదని మండిపడుతున్నారు. రాజ్యాంగబద్ధ అమలుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, బీసీలను మోసగించేందుకే జీవోల పేరిట కాలయాపన చేస్తూ వంచిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చేపట్టనున్న బీసీ బంద్‌కు (BC Bandh)సమాయత్తం అవుతున్నారు. బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు. కోర్టుల అభ్యంతరాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదంతా డ్రామాయేనని తేలిపోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.
రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధతపై తామిచ్చిన సూచనలను కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల అంశంపై జీవో వల్ల లాభం లేదని సుప్రీంకోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చిందని, చట్టబద్ధతతోనే అమలు సాధ్యమని తేలిందని బీఆర్ఎస్ మారో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. వ్యవస్థలన్నీ బీసీలకు వ్యతిరేకంగా మారిన ఈ నేపథ్యంలో బీసీలు ఐక్య ఉద్యమాలు చేపడితేనే రిజర్వేషన్లు సాధ్యమని బీసీ నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి చెప్తూనే ఉన్నదని తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఎం ప్రకటించింది.
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించన తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’ కార్యక్రమానికి విశాల మద్దతు వెల్లువలా వస్తున్నది. సకల జనులు మద్దతుగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో మరింత బలం చేకూరినట్టయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ఈ బంద్‌కు బీసీ జేఏసీ అన్ని వర్గాల మద్దతును కూడగడుతున్నది. ఇప్పటికే అన్ని బీసీ, వివిధ ప్రజా, కుల సంఘాలు, అఖిలపక్ష పార్టీలను జేఏసీ కలిసింది. ఈ మేరకు బీసీ బంద్‌కు వివిధ కుల సంఘాలు సైతం స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ముందుకొస్తున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంద్‌కు ఇప్పటికే సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ సర్కార్ కులగణన నిర్వహించింది. అసెంబ్లీలో బిల్లులు చేయడంతోపాటు, అమలు కోసం జీవో9ను జారీచేసింది. దీనిపై రెడ్డి జాగృతితోపాటు, పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవో9 అమలుపై స్టేను విధించింది. ఈ తీర్పుపై రాష్ట్రంలోని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అనుసరించిన విధానాలపై నిప్పు లు చెరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లను కల్పించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఇదే సమయంలో ఎస్ఎల్పీని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీసీ సంఘాలు పట్టుదలగా ఉన్నాయి.
బంద్‌కు సకలజనుల నుంచి మద్దతు లభిస్తున్నది. ఇటీవల బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు బంద్‌లో పాల్గొనాలని శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలపునిచ్చారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఓయూ ఐక్య విద్యార్థి సంఘం, పీడీఎస్‌యూ, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, ముదిరాజ్ సంఘం సైతం బంద్‌కు జైకొట్టాయి. తాజాగా లంబాడీ హకుల పోరాట సమితి సైతం బంద్‌కు మద్దతు తెలుపుతున్న ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మూడావాత్ రాంబల్‌నాయక్ ప్రకటించారు. సమితి కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని సకల జనులు మద్దతు పలకాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది. తెలంగాణ బీసీ బంద్‌కి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ ప్రకటించారు. బీసీ జేఏసీ బంద్‌లో తాము భాగస్వాములం అవుతామని, అన్ని కుల సంఘాలు, పార్టీలు అండగా నిలవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కోరారు.
బీసీ జేఏసీ నేతలు రాష్ట్ర బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్ మద్దతును కోరారని, మరి అలాంటప్పుడు ఎవరికి వ్యతిరేకంగా బంద్ చేపడుతున్నట్టు అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఈ విషయంపై బీసీ జేఏసీ నేతలు పునరాలోచించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలని, కేంద్రంపై ఐక్యంగా పోరాడాలని కోరారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు అడ్డుకుంటూ, మరోవైపు 18న చేపట్టే బీసీ బంద్‌కు మద్దతు ఇస్తామని నాటకం ఆడుతున్నదని విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు.
బీసీ జర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతామంటేనే తాము రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని, లేదంటే స్వతంత్రంగా ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ చేపడుతున్నామని పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా ప్రదర్శనలు, ధర్నా లు, బైక్ యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండ గా గురువారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తమ్మినేని వీరభద్రం, జాన్‌వెస్లీ వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం శనివారం పల్లెపట్నం సంపూర్ణ బంద్ పాటించాలని అఖిలపక్ష బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో ఊరూవాడా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ బంద్‌కు మద్దతుగా గురువారం అఖిలపక్ష బీసీ సంఘాల జేఏసీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 18న జరిగే బంద్ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.
బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీలు మధుయాషీ, వీ హనుమంతరావు, బీజేపీ నేత తల్లోజు ఆచారి తదితరులు మాట్లాడారు. బీసీలు శాంతియుతంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకుండా ఒకరోజు ముందుగానే ఆర్టీసీ బస్సులను బంద్ పెట్టాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి విజ్ఞప్తిచేశారు. అత్యవసర విభాగాలు తప్ప మిగతా అన్ని వర్గాలు బంద్‌కు సహకరించాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బీసీ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఇప్పుడిదే అంశం రాజకీయ వర్గాల్లో, బీసీ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది ఆ పార్టీయే. అధికారంలోకి వచ్చాక కులగణన నిర్వహించింది. ఆ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు జీవో9ని ఇటీవల జారీచేసింది.
రిజర్వేషన్ల అమలుకోసం కాంగ్రెస్ పార్టీ కులగణన మొదలు ఇటీవల జీవోజారీ వరకూ నిబంధనలకు తిలోదకాలిస్తూ అడ్డదిడ్డంగా తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన మార్గదర్శకాల ఫలితంగానే కోర్టులో అవి నిలబడలేని పరిస్థితి నెలకొన్నది. స్టే విధించే సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు సంధించిన ప్రశ్నలే అందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు సైతం అవే ప్రశ్నలను సం ధిస్తూ కాంగ్రెస్ సర్కారును నిలదీసింది. హైకోర్టు స్టేను ఎత్తేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల రచ్చ చెలరేగడానికి, కోర్టు వివాదాల్లో చిక్కుకోవడానికి కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు మరోవైపు బీసీ బంద్‌కు మద్దతు తెలపడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.