హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో గురువారం ప్రారంభమైన 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. తొలిరోజే పలువురు అథ్లెట్లు రికార్డులను తిరగరాశారు. మొదటిరోజు జరిగిన పోటీల్లో 11 ఈవెంట్లలో బంగారు పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు బరిలోకి దిగారు. ఉమెన్స్ డిస్కస్ త్రోలో హర్యానాకు చెందిన నిఖితకుమారి (50.73 మీటర్లు) పాత రికార్డుల (50.59 మీ.)ను బ్రేక్ చేసింది.
ఉమెన్స్ 100 మీటర్ల పరుగుపందెంలో రిలయన్స్‌కు చెందిన సాక్షి (11.62 సెకన్లు), మహారాష్ట్రకు చెందిన సుధీష్ణ హన్మంత సెమీస్‌లో 11.63 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసి కొత్త రికార్డులు సృష్టించారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని తమ ప్రతిభను చాటనున్నారు. పోటీలను వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు ప్రారంభించారు.