కొడంగల్, అక్టోబర్ 16: కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ కళాశాలలతోపాటు సమీకృత గురుకులాలను లగచర్ల ప్రాం తానికి తరలింపును నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో బంద్ పాటించారు. కొడంగల్ అభివృద్ధి ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం బంద్‌కు పిలుపునివ్వగా పట్టణంలోని దుకాణ సముదాయాలతోపాటు ప్రైవేటు పాఠశాలలు మద్దతు తెలుపడంతో బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. కొడంగల్ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డితో కొడంగల్ అభివృద్ధి చెందుతుందని ప్రజ లు భావించారని తెలిపారు.
అయితే కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ కళాశాలతోపాటు గురుకులాలను ఇతర ప్రాంతానికి తరలింపుతో వారు ఆందోళన వ్యక్తంచేశారు. స్థల సేకరణ చేపట్టిన తరువాత ఇతర ప్రాంతానికి తరలించే ప్రక్రియ చేపట్టడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌ను విద్యా హబ్‌గా మారుస్తానని చెప్పి కనీసం వ్యవసాయం చేసుకొని బతికే ఆసరా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకొని కొడంగల్ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని, లేదంటే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామ ప్రజలకు స్థానికంగా రాస్తారోకో చేపట్టారు.