న్యూఢిల్లీ: ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన వివాదంలో తాము ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ(హెచ్పీసీ) నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్.. తన ఉద్యోగ విరమణ కోసం కమిటీ ఎదురు చూస్తున్నదా? అని వ్యాఖ్యానించారు.న్యాయమూర్తులు జాయ్ మాల్య బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనం నవంబర్ 30లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
విచారణ కోసం ఈ అంశాన్ని ధర్మాసనం స్వీకరించిన వెంటనే సీజేఐ ‘నా ఉద్యోగ విరమణ తర్వాత తేదీ ఇవ్వమని నేరుగా అడిగి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ‘వారికి పగలు, రాత్రి పనిచేయమని చెప్పండి. రెండు నెలల్లో నివేదిక ఇవ్వండి’ అని కమిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటీకి సీజేఐ తెలిపారు. హెచ్పీసీ దీనిపై పనిచేస్తున్నది. రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఈ కేసును తదుపరి విచారణ కోసం డిసెంబర్ 2కి ధర్మాసనం జాబితా చేసింది.