పుణె : మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎంపీఎస్సీ) పరీక్షలు రాసే అభ్యర్థులు సోమవారం పెద్ద సంఖ్యలో పుణెలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియామక పక్రియలో పారదర్శకత పాటించాలని, పేపర్ లీక్‌లపై, వివిధ పరీక్షల్లో అవకతవలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీఎస్సీ చైర్మన్, కార్యదర్శి రాజీనామా చేయాలని, వారి స్థానంలో వెంటనే నిజాయితీ గల అధికారులను నియమించాలని కూడా వారు డిమాండ్ చేశారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్(గ్రూప్-బి) పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలపై 8 రోజుల్లోగా కమిషన్ వివరణ ఇవ్వాలని, ఆ పరీక్షల్లో అవకతవకలపై విచారణ ప్రారంభించాలని కోరారు. 2025 రాష్ట్ర సర్వీసుల ప్రధాన పరీక్ష, వ్యవసాయ సర్వీసులకు సంబంధించిన వివరణాత్మక సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలపై విచారణ జరపాలని అడిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎంపీఎస్సీకి అందించిన ప్రాథమిక నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఎంపీఎస్సీ అండర్ సెక్రటరీ అభిజిత్ లెండ్వే ఉద్యోగ కాలంలో నిర్వహించిన అన్ని పరీక్షలకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.