న్యూఢిల్లీ : పెరిగిన చక్కెర ధరల కారణంగా వినియోగ వస్తువుల కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో బిస్కెట్లు, చాక్లెట్లు, లడ్డూలు వంటి మిఠాయి పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. అమ్మకాలకు కీలకమైన ఈ పండుగ సీజన్‌కు ముందుగానే తయారీదారులు వీటి ధరలను పెంచే యోచనలో ఉన్నారు. దేశంలో ఆగస్టు చివరి నుంచి జనవరి వరకు కొనసాగే పండుగల సీజన్లో ఈ చక్కెర డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో సంప్రదాయ స్వీట్లు, పిండివంటల వినియోగం పెరగడమే ఇందుకు కారణం.
అయితే ఈ సంవత్సరం పెరుగుతున్న చక్కెర, పాల ధరలు చాక్లెట్, బిస్కెట్ తయారీదారులు, మిఠాయి తయారీదారులపై ఒత్తిడిని పెంచుతున్నందున వినియోగదారులు తమ పండుగ వినోదాల కోసం అధిక వ్యయాన్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈక్విటీస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం చక్కెర ధరలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దీనివల్ల బిస్కెట్లు, మిఠాయిలు, మాల్టెడ్ పానీయాలు, కార్బోనేటెడ్ పానీయాలు వంటి విభాగాలపై వ్యయభారం పెరిగింది.