హైదరాబాద్ : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ( Balka Suman ) పై నాంపల్లి పోలీస్ స్టేషన్ ( Nampally PS ) లో కేసు నమోదయ్యింది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలని, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు కేసులో ఇరికించాలని చూస్తున్నారని బాల్కసుమన్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల మాయంపై మంత్రులపై హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేయడంతో దాని నుంచి దృష్టిని మరల్చడానికి తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు.