Kidneys | చలికాలం.. కిడ్నీలకు కీడు తెస్తుంది. చల్లని వాతావరణం.. మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శీతకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. కిడ్నీల పనితీరును మరింత దెబ్బతీస్తుంది. ‘చలి’లో దాహం వేయకపోవడం, నీళ్లు తక్కువగా తీసుకోవడం కూడా.. మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ క్రమంలో కిడ్నీలను కాపాడుకోవాలంటే.. ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, కొన్ని పదార్థాలను దూరం పెట్టాల్సిన అవసరం ఉన్నది.
వేసవి, వర్షాకాలంతో పోలిస్తే.. చలికాలంలో రక్తపోటు అధికంగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో సమర్పించిన కొత్త పరిశోధన చెబుతున్నది. దీని అధిక రక్తపోటు.. కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మూత్రపిండాల్లోని రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడి.. బలహీనంగా మారిపోతాయి. క్రమంగా కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. కాబట్టి, ఆహారంలో ఉప్పును తగ్గించాలి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి.
చలికాలంలో తీపి పదార్థాలపైకి మనసు ఎక్కువగా మళ్లుతుంది. కాఫీలు, టీలు తాగడం కూడా పెరుగుతుంది. ఈ రెండు కారణాలతో రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పుతాయి. కిడ్నీలు దెబ్బతిని.. ‘డయాబెటిక్ నెఫ్రోపతీ’ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఫలితంగా.. రక్తంలోని వ్యర్థాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే.. కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. కాబట్టి, ఈకాలంలో తీపిని దూరం పెట్టడమే క్షేమం.
శీతకాలంలో చెమట తక్కువగా పడుతుంది. దాంతో చెమట రూపంలో బయటికి వెళ్లిపోవాల్సిన సోడియం.. మూత్రంలో కలిసిపోతుంది. ఫలితంగా.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిత్యం వ్యాయామం తప్పనిసరి. ఒళ్లంతా చెమట పట్టేలా.. వ్యాయామం చేయడం మంచిది.
చలికాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు.. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు పలకరిస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తుంటారు చాలామంది. అయితే, కొన్నిరకాల మందులు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కిడ్నీలకు రక్తప్రసరణను తగ్గిస్తాయి. అందుకే.. చిన్నచిన్న సమస్యలకూ మాత్రలు వేసుకోవడం తగ్గించాలి.