తాండూర్, ఆగస్టు 11 : మైనర్లు బైకులు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు. సోమవారం తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈమధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మైనర్ బాలురు ఉంటున్నారని అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అన్నారు.
మైనర్లు బైకులు నడిపితే, వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులపైనా కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ఈ విషయంపై తాండూర్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపడతామని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదారం ఎస్ సౌజన్య ఉన్నారు.