e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News కర్మలో నేర్పరితనమే యోగం

కర్మలో నేర్పరితనమే యోగం

నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నారు. అయితే, ‘యోగ’ం అష్టాంగ యోగ పద్ధతి ద్వారా వచ్చింది. చిత్త నిరోధమే యోగ ప్రధాన ప్రయోజనం. మనసును నిగ్రహించడమే యోగ ఆవశ్యకత. అష్టాంగయోగ పద్ధతి ‘సమాధి’ అనే ఎనిమిదవ అంగంతో ముగు స్తుంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగానికి ఉత్కృష్టమైన నిర్వచనం ఇచ్చాడు. అది సర్వదా, సర్వత్ర, సర్వులకు అన్వయించేది గాను, ఆచరణీయ మైనదిగాను కనిపిస్తుంది. అదే ‘యోగః కర్మసు కౌశలమ్‌- కర్మలో నేర్పరితనమే యోగం’ అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో పేర్కొన్నాడు. ఈ అద్భుతమైన యోగ నిర్వచనం కర్మషట్కంలో వస్తుంది. భగవద్గీత మొదటి ఆరు అధ్యాయాలను కర్మషట్కంగా అభివర్ణించారు. కర్మను ఏ విధంగా ప్రారంభించి విజయశీలురం కావాలో తెలియజేసే అధ్యాయాలు కాబట్టే మొదటి ఆరు అధ్యాయాలను కర్మషట్కంగా పేర్కొంటారు.
కర్మలో నేర్పరితనమే యోగం అనడంలో ఉద్దేశమేమిటి? కర్మలో నేర్పరితనం బుద్ధికి సంబంధించిన పని. మనిషి ఎంత ఎక్కువగా బుద్ధిని కర్మలో నియోగిస్తే అంత ఎక్కువగా నేర్పరి అవుతాడు. ఆ సమయంలో అతని మనసు అన్య విషయాల మీదికి పోదు. ఇతర విషయాలపైకి మనసును పోనివ్వకుండా నియంత్రించేదే యోగం కదా! అందుకే కర్మలో నేర్పరితనమే యోగమని శ్రీకృష్ణ భగవానుడు నిర్వచించాడు.

అర్జునుడి బాల్యంలో ఓ రాత్రిపూట అందరూ భోజనాలకు కూర్చున్నారు. పాండవులంతా కలిసి భోజనానికి ఉపక్రమించారు. ఇంతలో తీవ్రమైన గాలి మొదలైంది. భోజనశాలలో ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. ఆ గదంతా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అంత చీకట్లోనూ ఏ సంశయం లేకండా భోజనాలు కొనసాగించారు. ఏ వస్తువు ఎక్కడుందో తెలియకున్నా.. పళ్లెంలోని అన్నాన్ని ముద్దకలిపి చేతితో నోటికి అందిస్తున్నారు. భోజనం చేయడంలో బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా చేయి దానంతట అది తన పని చేసుకోగలిగింది. అదే నైపుణ్యం. ఇదే కౌశలం.. చీకటిలో బాణాలు వేయడంలోనూ సాధించవచ్చని అనిపించింది అర్జునుడికి. ఆ దిశగా చాలా రోజులు సాధన చేశాడు. కొన్నాళ్లకు మనసులో ఎలాంటి సంశయమూ లేకుండా రాత్రిపూట కూడా లక్ష్యానికి గురిపెట్టగల నైపుణ్యాన్ని, కౌశలాన్ని సాధించాడు. ద్రోణాచార్యుడి ప్రియశిష్యుడు అయ్యాడు.

- Advertisement -

మనిషి మనసును జయించగలిగితే, నియంత్రించగలిగితే యోగ ప్రవీణుడు అవుతాడు. అయితే ఇది ధ్యానం ద్వారా సాధించవచ్చు. భగవద్గీతలో చెప్పినట్టు ఏదైనా కార్యంలో నేర్పరితనాన్ని సాధించడం ద్వారా కూడా యోగ ప్రావీణ్యం పొందవచ్చు. ఈ రెండిటిలో గీతలో చెప్పిన పద్ధతి అందరికీ ఆచరణీయమైనది. మనో నిగ్రహం లేని వ్యక్తి ఏ కార్యాన్నీ సాధించలేడు! అందుకే మానసికచింతకు గురైనవారు, ఒత్తిడికి లోనవుతున్న వారు ఏదో ఒక కార్యంలో నైపుణ్యం సాధిం చడానికి నడుం కట్టాలి. పని నేర్చుకోవడం తొలి మెట్టు అయితే, ఆ పనిలో నైపుణ్యత సాధించడం తర్వాతి మెట్టు. ఇక కార్య నైపుణ్యంలో ఇతరులకు తర్ఫీదు ఇవ్వడం కార్యదక్షతలో పరాకాష్ఠగా చెప్పవచ్చు. మనిషి తనకు కలిగే మానసిక ఒత్తిడిని ఒక చక్కని అవకాశంగా తీసుకొని ఏదో ఒక కార్యంలో ప్రవీణుడై బాగుపడాలి. పదుగురికి బాగుపడే అవకాశం ఇవ్వాలి. ఇదే గీతామార్గం!

డాక్టర్‌ వైష్ణవాంఘ్రిసేవక దాస్‌
98219 14642

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement