TG TET | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు హాజరయ్యే టీచర్లకు ఆన్‌డ్యూటీ(ఓడీ) కల్పించే అంశం సర్కారు పరిశీలనలో ఉన్నది. ఓడీ కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు.
టెట్ పరీక్షలకు ఈ సారి 71,670 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు ఓడీ సౌకర్యం కల్పించాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. టెట్ పరీక్షలకు ఆదివారం 8 వేలకు పైగా అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొదటి సెషన్లో 4,311 మంది, రెండో సెషన్లో 4,093 మంది గైర్హాజరయ్యారు. శనివారం 7వేల మంది గైర్హాజరు కాగా, రెండు రోజుల్లో 15వేల మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఓల్డ్ అల్వాల్‌లోని పరీక్షకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోసం జాతీయస్థాయిలో ఉమ్మడిపోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఐఎస్టీఎఫ్) ప్రధాన కార్యదర్శి జీ సదానందంగౌడ్ వెల్లడించారు. కేంద్రం చొరవ తీసుకుని, పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ అంశంపై కేంద్రం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నర్సింహారెడ్డి, ఎస్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, పరమేశ్, సాబేర్‌అలీ, పున్న గణేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.