హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా పీఎస్ఏఆర్ఏ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల(నియంత్రణ)చట్టం- 2005, తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల(నియంత్రణ)నిబంధనలు- 2022 పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇటీవల సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ హత్య కేసులో రంజిత్పాండే, రితేశ్‌కుమార్ రాయ్ అనే సెక్యూరిటీగార్డ్‌లు నిందితులుగా ఉన్నట్టు చెప్పారు. వీరు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని సంపద సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగులుగా ఉన్నట్టు విచారణలో తేలిందని, సంబంధిత ప్రైవేట్ సెక్యూరిటీ పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా గుర్తించి ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.