Mobile Phone | కవాడిగూడ, ఫిబ్రవరి 17: పిల్లలు సెల్ఫోన్ జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ బి.ఆనంద్ సూచించారు. మొబైల్కు బానిస అయితే జీవితం ఆగమవుతుందని తెలిపారు. విద్యార్థి దశలో సెల్ ఫోన్ వాడాల్సిన అవసరం లేదని చెప్పారు. తల్లిదండ్రుల సమక్షంలో వారు వాడమన్నప్పుడే వాడాలని సూచించారు. మొబైల్ ఫోన్లు ఉపయోగించని పిల్లలు అంటేనే తనకెంతో ఇష్టమని చెప్పారు.
హైదరాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కవాడిగూడ చిత్రాల నర్సింహులు స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బి. ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు ఎల్లూరి నరేంద్ర కుమార్, పాఠశాల డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి లయన్ కృష్ణారావులతో కలిసి విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం డీసీపీ ఆనంద్ మాట్లాడుతూ.. జీవితంలో పిల్లలకు తల్లిదండ్రులు, గురువు ముగ్గురు మాత్రమే ముఖ్యమైన వారిని తెలిపారు. వారిని దాటి పోకూడదని సూచించారు. వారిని కాదని ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. సొంత నిర్ణయాలు తీసుకొని ఎన్నో ఇబ్బందులకు గురైన వారిని చాలామందిని చూశానని చెప్పారు. ఒక పోలీస్ అధికారిగా తాను అనేక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లానని, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే అదృష్టం ఈరోజు దొరికిందన్నారు. ఎందుకంటే తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించే వారిని తెలిపారు. పెద్దయ్యాక ఏమవుతారని అడిగితే ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పేవారని తాను పోలీసు అవుతానని చెప్పానని అన్నట్లే పోలీస్ అయ్యానని అన్నారు. మీతో మాట్లాడటం నాకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఎస్సై హరీశ్, కాచిగూడ మహిళా హాస్టల్ వైస్ ప్రెసిడెంట్ బాదం కళావతి, వాసవి క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు అనంతుల దయాకర్, ప్రధాన కార్యదర్శి పబ్బ శ్రీనివాస్, కోశాధికారి ప్రదీప్ కుమార్, ప్రాజెక్టు చైర్మన్ హరీశ్ కుమార్, వర కుమార్, బాదం సాయి ప్రసాద్, జ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనా కుమారి, ఉపాధ్యాయులు నాగయ్య, సుబ్రహ్మణ్యం, సౌజన్య, కిరణ్మయి, హేమలత, అనురాధ, సుమలత, వెంకటలక్ష్మి, రజని, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.