చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నదని సైబరాబాద్ సీపీ మహంతి అన్నారు. బస్సు, టిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. బస్సును ఢీకొనడంతో టిప్పర్లోని కంకర బస్సులో పడిందని, దీంతో ఒక్కసారిగా మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్లలోనే శవపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శవపరీక్ష పూర్తయిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన కాంబ్లు.. మహబూబ్‌నగర్‌కు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు టిప్పర్ వెళ్తున్నదని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టిందన్నారు.