రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎప్పటిలాగే.. పట్టణాల్లో ఓటర్లు నిర్లక్ష్యం కనబర్చినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లేందుకు ఓటర్లు క్యూ కట్టడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిశాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ అభ్యర్థులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. రాజేంద్రనగర్‌లోని నారం గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు. బంజారాహిల్స్‌లో కలెక్టర్ శశాంక ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2,877 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల విధుల్లో మైక్రోఅబ్జర్వర్లు 216 మంది, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలుపుకొని మొత్తం 13,443 మంది విధులు నిర్వర్తించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటల నుంచి సాధారణ పోలింగ్ షురూ కాగా, సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగిన ఓటింగ్ సరళిని రంగారెడ్డి కలెక్టర్ శశాంక రాజేంద్రనగర్‌లోని నారం గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తును చేపట్టారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో ఎన్నికల అధికారులతోపాటు పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన స్వగ్రామమైన చేవెళ్ల నియోజకవర్గంలోని కౌకుంట్లలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట మండలంలోని చించల్‌పేట్‌లో ఓటు వేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల మండలం ధర్మసాగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, టీటీడీ డైరెక్టర్ సీతారెడ్డి మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు బిత్తిరి సత్తి చేవెళ్ల నియోజకవర్గంలోని పామెన గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపర్చారు. జిల్లాలో ఓటింగ్ కోసం 3,591 కంట్రోల్ యూనిట్లను, 10,757 బ్యాలెట్ యూనిట్లను, 4,008 వీవీప్యాట్లను వినియోగించారు. పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను డిస్టిబ్యూటరీ సెంటర్లకు తరలించి అక్కడి నుంచి పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించారు.
స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్‌తోపాటు మూడంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారా మిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో దశలో సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. జూన్ 4న చేవెళ్ల మండలంలోని బండారి శ్రీనివాస్ కళాశాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
‘చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో 60.07 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉండగా పోలింగ్‌లో 60.07శాతం మంది తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 43 మంది ఉండగా.. జూన్ 4న జరిగే కౌంటింగ్‌లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా, తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది.’ చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 70.84 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 43.11 శాతం నమోదైంది.
ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన పోలీస్ అధికారులకు, ఏఆర్వోలకు, ఏఐఆర్వోలకు, నోడల్ అధికారులకు, బీఎల్వోలకు, బీఎల్వో సూపర్ వైజర్లకు, వివిధ శాఖలకు సంబంధించిన ఎన్నికల సిబ్బందికి కృతజ్ఞతలు.