రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్నల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కార్మికులకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. రూ.2 వేలు నేత కార్మికుడికి, వెయ్యి అనుబంధ కార్మికుడి(భార్య లేదా కుటుంబ సభ్యులు) ఖాతాల్లో జమ చేస్తున్నది. ఒక వేళ అనుబంధ కార్మికులు ఇద్దరు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జమవుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచే ఖాతాల్లో డబ్బులు జమవుతుండడంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకంతో చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగనున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన ఈ పథకంతో నేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి. ఎలాంటి బిల్లులు, దళారీలు లేకుండా సబ్సిడీ డబ్బులను నేరుగా చేనేతల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయం. గతంలో ఏ ప్రభుత్వాలూ చేనేతలకు ఇలాంటి మేలు చేయలేదు. దళారుల ద్వారా బిల్లులు అందజేస్తేనే సబ్సిడీ వచ్చేది. గ్యారెంటీ లేకుండె. కానీ, ఇప్పుడు దళారుల బెడద లేదు. బిల్లుల సమస్య అసలే లేదు. నేరుగా మాకు డబ్బులు అందుతున్నాయి. ఈ పథకాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని కోరుకుంటున్నాం.
-వడ్డేపల్లి రమేశ్, గుండ్రాంపల్లి, చిట్యాల
గత పాలకులు, ప్రభుత్వాలు ఏనాడూ చేనేత రంగాన్ని పట్టించుకున్న దాఖాలు లేవు. బుక్కెడు బువ్వ దొరకని దుర్భర స్థితిలో ఉండి ఎంతో మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ సార్ చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని చేనేత మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి మా కుటుంబాల్లో సంతోషం నింపారు. ప్రభుత్వం నుంచి నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం అందుతుంది. చేనేత కార్మికుల కోసం తెచ్చిన చేనేత మిత్ర మా జీవితాలకు భరోసానిస్తుంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే కార్మిక లోకం సంతోషంగా ఉంటుంది.
-కర్నాటి రాజు, చేనేత కార్మికుడు, మునుగోడు
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా చేనేతలకు చేసిందేమీ లేదు. రంగులు, నూలు, రసాయనాల ధరలు బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 40 శాతానికి పెరిగాయి. చేనేత కుటుంబాలకు మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను దరిదాపుల్లోకి కూడా రానివ్వం. 20ఏండ్ల నంచి చేనేత వృత్తి జీవనాధారంగా పని చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి దాకా మా కోసం ఏ పథకమైనా రాకపోదా? అని ఎదురుచూస్తున్నా. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి పథకాలు అందించలేదు. నేతన్నల బతుకులు రోడ్డుమీదకొచ్చే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకుని అక్కున చేర్చుకుండు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదు. బీజేపీ ప్రభుత్వం చేనేత, జౌళి పరిశ్రమలపై 5 శాతం జీఎస్టీ విధించి మా బతుకులను బజారుకీడుస్తుంది. రైతుబీమా మాదిరిగానే చేనేతబీమా, చేనేత పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. చేనేత మిత్ర పథకం పేరుతో చారిత్రాత్మక పథకాన్ని అమల్లోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే. అర్హులైన చేనేత కార్మికులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున నేరుగా మా ఖాతాల్లోనే జమచేస్తుంది. నూలు, రంగులు, రసాయనాల కొనుగోళ్లకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్‌తోనే ఏదైనా సాధ్యం. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్‌కు మేమంతా అండగా ఉంటాం.
-బాల్నె శ్రీనివాస్, చేనేత మిత్ర లబ్ధిదారుడు, పద్మశాలీ కాలనీ, నకిరేకల్
మాది ఆలేరు పట్టణం. మగ్గం వర్ చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నాం. నాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వాళ్ల పోషణ కోసం నేను మగ్గం నడుపుతున్నాను. నాకు చేనేత మిత్ర పథకం కింద నెలకు రూ.3 వేలు రావడం చాలా సంతోషంగా ఉంది. నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమం మరువలేనిది. చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న ఆదరాభిమానాలను జీవితాంతం గుర్తుంచుకుంటాం.
-రేగోటి వెంకటేశ్, చేనేత కార్మికుడు, ఆలేరు
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 3 : చేనేత మిత్ర పథకం ద్వారా నేత కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ చేసి సీఎం కేసీఆర్ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని సర్పంచ్ భీమనపల్లి అనూరాధ, ఉప సర్పంచ్ గంజి పాండురంగం అన్నారు. చేనేత మిత్ర పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం మండలంలోని చిన్నగౌరాయపల్లిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెంటే చేనేత కార్మికులమంతా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కొంగరి రాజు, గడ్డం అక్షర, కో ఆప్షన్ సభ్యురాలు చెన్న ఉష, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భోగ శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు గోలి భానుప్రకాశ్, మండల నాయకులు నల్ల శంకర్, గడ్డం శేఖర్, చేనేత కార్మికులు పెండెం అంజయ్య, చెన్న ఉపేందర్, లక్ష్మయ్య, కుమార్, భోగ లక్ష్మయ్య పాల్గొన్నారు.
నేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చేనేతమిత్ర పథకం మాకు వరం లాంటిది. ప్రభుత్వం అందిస్తున్న సాయం మాకు ఎంతగానో ఉపయోగం. నేత వృత్తిపై ఆధారపడ్డ మాకు ఈ పథకం ఎంతగానో అండగా నిలుస్తుంది. చేనేత కార్మిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడూ మమల్ని పట్టించుకున్న దాఖలు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కానుంచి మా బాధలు తెలుసుకొని సీఎం కేసీఆర్ అనేక పథకాలు అందిస్తున్నారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం చేపట్టింది. అందులో భాగంగా కార్మికులకు పింఛన్‌తోపాటు పరిశ్రమలకు ఇస్తున్న నూలు సబ్సిడీ పైసలు నేరుగా కార్మికుడికి అందేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. పొద్దంతా కష్టపడి పనిచేస్తున్న మాకు ప్రభుత్వం అందిస్తున్న సాయం చేదోడుగా ఉంటుంది. సర్కారు ఇస్తున్న సాయం ఎవరి చేతులకు వెళ్లకుండా మా ఖాతాల్లోనే వేయడం ఆనందంగా ఉంది.
-అంకం మల్లేశం, చేనేత కార్మికుడు, కొలనుపాక, ఆలేరు రూరల్