Obesity | బీజింగ్, ఆగస్టు 11: ఊబకాయం సమస్యను పరిష్కరించుకునేందుకు దోహదపడే గొప్ప విజయాన్ని శాస్త్రవేత్తలు సాధించారు. క్యాలరీల స్వీకరణను పరిమితం చేయడం ద్వారా ఉదరం, మెదడులో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని, ఇది ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువును తగ్గించుకునేందుకు సరికొత్త మార్గాలను తెరుస్తుందని కనుగొన్నారు. అడపా దడపాగా శక్తిని పరిమితం చేసే ఐఈఆర్ (ఇంటర్మిట్టెంట్ ఎనర్జీ రెస్ట్రిక్షన్) కార్యక్రమాన్ని చైనా పరిశోధకులు నిర్వహించారు.
కొన్ని రోజులపాటు పరిమితంగా క్యాలరీలను తీసుకోవడం, ఉపవాసంతో కూడిన ఈ ప్రక్రియలో ఊబకాయులైన 25 మంది వలంటీర్లు 62 రోజులపాటు పాల్గొన్నారు. దీంతో వారు 7.6 కిలోల బరువు తగ్గారు. ఇది వారి మొత్తం శరీర బరువులో 7.8 శాతానికి సమానమని, ఐఈఆర్ వల్ల ఊబకాయానికి సంబంధించిన మెదడు భాగాల పనితీరు మారడం, ఉదరంలో బ్యాక్టీరియా ఏర్పడటమే వారి శరీర బరువు తగ్గుదలకు కారణమని పరిశోధకులు గుర్తించారు.
ఎక్కువగా పళ్లూడిపోతే గుండె జబ్బులు!
న్యూఢిల్లీ: ఎక్కువగా పళ్లూడిపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దంతాలు ఊడిపోవడం వల్ల వ్యాధి కారకాలు చిగుళ్లలోకి చొచ్చుకుపోయేందుకు అనుమతి లభిస్తుంది. దీని వల్ల వాటి ప్రసరణ, వాపు పెరుగుతాయి. ఇది గుండెపై ప్రభావం చూపవచ్చు. అయితే దీంతోపాటు ధూమపానం, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు లాంటివి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తెలిపారు. తక్కువ సంఖ్యలో లేదా అసలు దంతాలు కోల్పోని వారితో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో లేదా తమ పళ్లన్నీ కోల్పోయినవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 66 శాతం ఎక్కువని పరిశోధకుల విశ్లేషణలో తేలింది. 12 అధ్యయనాలను విశ్లేషించిన అనంతరం నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
5 కిలోల ఆలుగడ్డలు లంచం.. ఎస్ఐ సస్పెన్షన్ !
లక్నో, ఆగస్టు 11: యూపీలో ఒక పోలీస్ అధికారి ఒక రైతు నుంచి ఐదు కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగి సస్పెండ్ అయ్యాడు. అతడు రైతును ఐదు కిలోల ఆలుగడ్డ లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా, అంత ఇచ్చుకోలేనని రైతు అనడంతో చివరకు బేరం మూడు కిలోలకు కుదిరింది. ఈ సంభాషణ ఆడియో వైరల్ కావడంతో అధికారులు లంచం అడిగిన కన్నౌజ్ జిల్లా సౌరిక్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రామ్‌కృపాల్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆలుగడ్డ అని ఎస్ఐ వాడినది కోడ్ వర్డ్ అని, బహుశా 5 కేజీలు అంటే రూ.5 వేలు, లేదా రూ.5 లక్షలు కావచ్చునని కన్నౌజ్ ఏసీపీ తెలిపారు.