అమరావతి : ఎల్‌నినో ( El Nino ) ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ చంద్రబాబు ( Chandra Babu ) ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan reddy ) ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైసీపీ నాయకులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వర్షపాతం లోటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యచరణ చేపట్టలేదని విమర్శించారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని అన్నారు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగుచేసిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు నష్టపోయారని వివరించారు.
శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్‌లపై కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం కేంద్రాన్ని వెంటనే అదనపు పనిదినాలు కోరాలని సూచించారు.
కరువు సమస్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలి
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వైసీపీ ఆందోళన కార్యాక్రమాలను చేపట్టాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానని తెలిపారు.