అమరావతి : విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలకు మంచినీరు ( Drinking Water) అందించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarnath ) ఆరోపించారు. ఆదివారం విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచినీరు బదులు మందు మాత్రం అందిస్తున్నారని దుయ్యబట్టారు.
విశాఖలో మూడురోజులకు ఒకసారి మంచినీటిని ఇస్తున్నారని మండిపడ్డారు. మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని విమర్శించారు.
విశాఖలో విచ్చలవిడిగా భూములు అమ్ముకుంటున్నారని, పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తల ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.