చందంపేట: మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల పరిధిలో ఉన్నఅటవీ భూములను క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించడానికి జిల్లా సర్వే టీమ్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేయించి వాస్తవ రైతులను గుర్తించి అటవీ భూ సమస్యలను పరిష్కరిస్తామని దేవరకొండ ఆర్డీవో గోపీరామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎఫ్డీవో సర్వేశ్వర్, భూ సర్వే ఏడీతో కలిసి భూమి మ్యాప్ లను పరిశీలించారు.
గతంలో ప్రభుత్వం రైతులకు భూమిని పంపిణీ చేసిన మ్యాప్ ఆధారంగా రికార్డులను పరిశీలించి సర్వే నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ నెల 22న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, డీఫ్వో రాంబా బు ఆధ్వర్యంలో మండలంలోని కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల్లో రైతులకు అటవీ భూములపై సమావేశం ఏర్పాటు చేశారు.
ఆయా గ్రామాల్లో అటవీశాఖ అధికారుల, రైతుల మధ్య భూ వివాదం నెలకొని పలువురిపై కేసులు నమోదైన ఘటనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సమక్షంలో జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేసి త్వరలో సర్వే నిర్వహిస్తా మని హామీ ఇవ్వడంతో ఈ మేరకు బుధవారం ఆయా గ్రామాల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములలో రెవిన్యూ, అట వీ శాఖలఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.
మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పోగిళ్ల, సర్కిల్ తండా, కాచరాజుపల్లి, చిత్రియాల, రేకులగడ్డ, ఉస్మాన్ కుంట, ఎలమలమంద, పెద్దమూల, తెల్దేవర్పల్లి సెంటర్ గ్రామాల్లో భూ వివాదం ఉన్నందున ఆయా గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు రికార్డుల ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేసి ఉన్నాయా లేదా అనే కోణంలో సైతం రికార్డులను పరిశీలించి రైతుల వారీగా భూములకు సర్వే నిర్వహించనున్నారు.
వారం రోజులుగా ఆయా గ్రామాల్లో రైతుల వారీగా సర్వే నిర్వహించి అటవీ భూముల సమస్యలను తొలగించే విధంగా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిశీలించిన వారిలో ఎఫ్డీవో సర్వేశ్వర్, తహసీల్దార్ దేవదాస్, ఏడీ శ్రీనివాస్, ఏఓ వంశీ, ఎఫ్ఆర్వో రాజేందర్, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, సర్వేయర్ లక్ష్మన్, రైతులు ఉన్నారు.