హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గత ఐదేండ్లలో కేవలం రూ.450 కోట్లే విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీ) సమర్పించినప్పటికీ, గత ఐదేండ్లలో (2019-20 నుంచి 2023-24వరకు) వెనుకబడిన జిల్లాలకు అందించాల్సిన వార్షిక రూ.450 కోట్ల ప్రత్యేక ఆర్థికసాయాన్ని ఎందుకు విడుదల చేయలేదు?
ఈ నిధులను ఎప్పటిలోగా విడుదల చేసే అవకాశమున్నది? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 కింద ఇప్పటివరకు సంవత్సరాలవారీగా తెలంగాణకు మంజూరు చేసి, విడుదల చేసిన నిధుల సమగ్ర వివరాలేంటి? అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం పైవిధంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఐదు విడతల్లో ఇప్పటికే రూ.2,250 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 2021 మార్చి 31న చివరి విడతగా రూ.450 కోట్లు విడుదల చేసినట్టు తెలిపిన కేంద్ర మంత్రి..2022 నుంచి ఇప్పటివరకు ఎంత విడుదల చేశారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.