హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. బొగ్గు గనుల టెండర్లలో అవినీతి జరుగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేయడం, బీఆర్ఎస్ సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెండర్లను రద్దు చేస్తామని ప్రకటించగా, టెండర్లను రద్దు చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి టెండర్ల బాగోతంపై దృష్టిపెట్టింది. టెండర్లను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కేంద్ర గనుల శాఖ, సింగరేణి బోర్డులోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు.
‘జూమ్’ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి చివరకు టెండర్లను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. మరోవైపు, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా నైని బొగ్గు గని వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి బోర్డు నుంచి సమగ్ర నివేదిక కోరారు. దీంతోపాటు కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఆ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్‌రాజ్ నారాయణ్ సింగరేణి సంస్థకు సమాచారం ఇచ్చారు.
ఇద్దరు సభ్యులతో సాంకేతిక కమిటీ
సింగరేణి సంస్థ గత ఏడాది నవంబర్ 25న నైని బొగ్గు గనిలో ‘మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) కోసం ఇచ్చిన టెండర్‌ను సాంకేతికంగా పరిశీలించి, విశ్లేషించేందుకు ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ డీజీఎం చేతనాశుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఇందులో సభ్యులుగా ఉంటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రకటించింది. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక అందజేస్తుందని పేర్కొన్నది.