హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో యూపీఏ హయాంలో పదేండ్ల కాలంలో భారీ బొగ్గు కుంభకోణాలు వెలుగు చూశాయని గుర్తుచేశారు. దీంతో సుప్రీంకోర్టు 216 కోల్ బ్లాక్స్‌ను రద్దు చేసిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఖర్చుల వివరాలు ఎప్పుడూ వెల్లడించలేదని, తప్పుడు విధానాలతో టెండర్లలో సెల్ఫ్ సర్టిఫికెట్ బదులు ‘సైట్ విజిట్ పేరిట కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రభుత్వం సింగరేణికి రూ.47వేల కోట్లు బాకీ పడిందని వెల్లడించారు. కోల్ బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆ రోపించారు. నైని కోల్‌బ్లాక్ అక్రమ టెండర్ల విషయంలో కొందరు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం అనుమతిస్తేనే సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడి ఇన్వెస్టర్లను తీసుకెళ్లి దావోస్‌లో మీటింగ్ పెడుతున్నాడని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.