న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఎన్జీవోలు, మైనారిటీ సంస్థలకు విదేశాల నుంచి వచ్చే విరాళాలను నియంత్రించే ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026కు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర నిరసనలు ఎదురుకావడంతో కేంద్రం ప్రస్తుతానికి దానిని అటకెక్కించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఇది కరుడుగట్టిన చట్టమని, ఎన్జీవోలను, మైనారిటీ సంస్థలను హస్తగతం చేసుకొనేందుకే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెడుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సవరణ బిల్లును ఆమోదానికి పెడితే కేరళ ఎన్నికల్లో క్రైస్తవ ఓటర్లు దూరం అవుతారన్న భయంతోనే కేంద్ర సర్కార్ వెనుకకు తగ్గినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం గత నెల 25న ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కాగా బుధవారం ఈ బిల్లుపై చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మంగళవారమే ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు ఆమోదం పొందితే కేరళలో విదేశీయుల విరాళాలతో నడుస్తున్న స్కూళ్లు, దవాఖానలు, సేవా సంస్థలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయని చర్చ్ లీడర్లు, క్యాథలిక్ బిషప్లు ఆందోళన వ్యక్తంచేశారు. వీరికి ఇటు కాంగ్రెస్, అటు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.