సంగారెడ్డి, మే 20 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాలను వెతికే పనిలో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గొల్లపల్లిలో పాకిస్థాన్‌కు రహస్యంగా సమాచారం చేరవేస్తున్న అస్సాం రాష్ర్టానికి చెందిన మోఫిజుల్ ఇస్లాం(19)ను అస్సాం టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. మోఫిజుల్ ఇస్లాం భారతదేశంకు చెందిన సిమ్‌కార్డులు పాకిస్థాన్ వారు ఉపయోగించుకునేందుకు సహకరించాడు.
ఇస్లాం వద్ద నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ సిమ్‌కార్డులతో పాటు కొన్ని పత్రాలను అస్సాం టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోఫిజుల్ ఇస్లాం అరెస్టు సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. దీంతో సంగారెడ్డి జిల్లా పోలీసులతో పాటు నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.