న్యూఢిల్లీ, జూన్ 16: దేశవ్యాప్తంగా 16వ జనగణనతోపాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. చివరిగా 2011లో దేశంలో జనగణన జరగగా మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నది. మంచు అధికంగా కురిసే లద్దాఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1వ తేదీ నుంచి జనగణన మొదలవుతుంది.
దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణను 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు నిర్వహిస్తారు. సుమారు 1.3 లక్షల మంది సెన్సస్ నిర్వాహకులు డిజిటల్ పరికరాలతో పాల్గొంటారు. జనగణనతోపాటు కులగణన కూడా జరుగుతుందని ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనగణన ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు విడతలలో జనగణనని నిర్వహిస్తారు. మొదటి విడతలో హౌస్లిస్టింగ్ ఆపరేషన్(హెచ్ఎల్ఓ), ప్రతి ఇంటి పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాలు సేకరిస్తారు. రెండవ విడతలో ఇంటింటి జనాభా లెక్కలు, ప్రతి ఇంటిలోని ప్రతి సభ్యుడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలు సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణ దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ఇది 16వది. స్వాతంత్య్రం తర్వాత ఇది 8వ సారి. జనాభా లెక్కల సేకరణ, వాటిని డిజిటల్ రూపంలో బదిలీ చేయడం, భద్రపరచడం వంటి అంశాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన కోసం ప్రభుత్వానికి రూ. 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాజ్యాంగంలోని 246 అధికరణ ప్రకారం ఏడో షెడ్యూల్లో 69వ అంశంగా జనగణన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన జనాభా లెక్కలను సేకరించవలసి ఉంటుంది. రానున్న జనాభా లెక్కల సేకరణలో కుల గణనను కూడా స్వాతంత్య్రానంతరం మొట్టమొదటిసారి ప్రభుత్వం చేర్చింది. చివరిసారి కులాల వారీగా గణాంకాల సేకరణ 1881 నుంచి 1931 మధ్య బ్రిటిష్ పాలకులు చేశారు. స్వాతంత్య్రం తర్వాత నిర్వహించిన అన్ని జనగణనల్లో కుల గణనను ప్రభుత్వాలు మినహాయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణనను క్యాబినెట్లో ఆమోదిస్తామని లోక్సభలో హామీ ఇచ్చారు. అయితే అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం కుల గణనను నిర్వహించడానికి బదులుగా సామాజిక-ఆర్థిక , కుల గణన పేరిట సర్వే వైపు మొగ్గు చూపింది.