హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాదర్గుల్ సర్వే నంబర్-613లోని భూములపై రెవెన్యూశాఖ అధికారుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇది. సాఫీగా సాగిపోతుందనుకున్న వ్యవహారం బహిర్గతం కావడంతో రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది. కానీ, మూడు రోజులవుతున్నా వారు చర్యలకు దిగిన దాఖలాలు లేవు. ఇంటెలిజెన్స్, ఎస్బీ ఇలా నిఘా విభాగాలు ఆరా తీయడమే తప్ప, రెవెన్యూశాఖ నుంచి మాత్రం స్పందన శూన్యం. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, క్షణాల్లోనే పోలీసులు ప్రత్యక్షమవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ఆ భూముల వద్దకు పోతే తనను బౌన్సర్లు అడ్డుకున్నారని, రక్షణ కల్పించాలని కోరినా ఆదిభట్ల పోలీసులు స్పందించలేదని సాక్షాత్తూ ఓ ప్రభు త్వ అధికారి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, రైతులను నిలువరించేందుకు మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ఆ భూముల్లో ప్రైవేట్ వెంచర్ ఉన్నదని పోలీసులే తమ ప్రకటనలో ధ్రువీకరిస్తుండటం కొసమెరుపు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్-613లో రూ.6 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబట్టేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సర్కార్ పెద్దల నేతృత్వంలో రంగంలోకి దిగిన ప్రైవేట్ నిర్మాణ కంపెనీ ఆగడాలపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక రెవెన్యూశాఖ అధికారులు కిందామీద పడుతున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న వ్యవహారం రచ్చకెక్కడంతో ప్రభుత్వం పలు విభాగాల ద్వారా లోతుగా ఆరా తీస్తున్నది. ఇప్పటికే సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మరోవైపు ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాలు మూడోరోజు పలు కార్యాలయాల్లో ఆరా తీయడం కనిపించింది. సోమవారం బాలాపూర్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన అధికారులు సర్వే నంబర్-613కు సంబంధించిన రికార్డులు పరిశీలించి, వాటి ప్రతులను తీసుకున్నారు. మొదటి నుంచీ ప్రతి రికార్డులోనూ 373.22 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉండటంతో ఆ మేరకు సర్కార్‌కు నివేదిక పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి వెళ్లి సదరు నిర్మాణ సంస్థ ప్రహరీ నిర్మాణానికి చేసుకున్న దరఖాస్తు, దాని పురోగతి, ఇంకా ఆ సర్వే నంబర్లో ఏమైనా అనుమతులు ఇచ్చారా? అనే వివరాలు సేకరించారు. దరఖాస్తుతోపాటు నిర్మాణ సంస్థ ఇచ్చిన కోర్టు తీర్పులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రతుల సెట్‌ను అధికారులు తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై ప్రభుత్వం నివేదిక కోరిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అసలు ఆ సర్వే నంబర్లో ప్రస్తుతం ఎంత భూమి ఉన్నది? అందులో భారీ గుట్టలు ఎన్ని ఉన్నాయి? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి? నిర్మాణ సంస్థ ఎంత విస్తీర్ణంలో ప్రహరీ వేసింది? 70 ఏండ్లుగా ఎవరెవరు అందులో సాగు చేస్తున్నారు? అనే వివరాలను తీయాలంటే సమగ్ర సర్వే చేస్తేనే సాధ్యమవుతుందని పలువురు రిటైర్డ్ అధికారులు సూచిస్తున్నారు. సాగు చేస్తున్న రైతుల వివరాలు తెలియాలంటే వాళ్లు కబ్జాలో ఉండాల్సి ఉంటుంది. కానీ, నిర్మాణ సంస్థ కొందరిని ప్రలోభపెట్టగా, మరికొందరిని బెదిరించి వెళ్లగొట్టినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో అధికారుల సర్వేలో ప్రొటెక్ట్ టెనెంట్ రైతుల వివరాలు తెలియక, వారికి అన్యాయం జరిగే ప్రమాదముందని కూడా హెచ్చరిస్తున్నారు.
సర్వే నంబర్-613లోని ప్రభుత్వ భూమిలో ప్రహరీ నిర్మాణ పనులు జరుగుతుంటే తాము నిలువరించేందుకు అక్కడికి వెళ్లామని, రక్షణ ఇవ్వాలని కోరినా ఆదిబట్ల పోలీసులు స్పందించలేదని గతంలో బాలాపూర్ తహసీల్దార్ స్పష్టంచేశారు. కానీ, తాజాగా ఆదిబట్ల పోలీసుల తీరు మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. రెండు రోజుల క్రితం కొందరు రైతులు ఆ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా క్షణాల్లో ఆదిబట్ల పోలీసులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సదరు రైతులను వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. కోహినూర్ వెంచర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్టు అధికారికంగా పేర్కొన్నారు. దీంతో ఆ భూముల్లో వెంచర్ ఎక్కడ ఉన్నది? ఒకవేళ ఉంటే అనుమతులు లేకుండా వెంచర్ ఎలా చేశారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రెవెన్యూ అధికారులే అవి ప్రభుత్వ భూములు అని స్పష్టం చేసినా, పోలీసులు మాత్రం అది వెంచర్ అని ధ్రువీకరిస్తుండటం గమనార్హం. మరోవైపు ఈ భూముల్లో 2016 నుంచి ఇప్పటిదాకా సేల్డీడ్స్లో కోహినూర్ అనే నిర్మాణ సంస్థ పేరు ఎక్కడా లేదు. బడంగ్‌పేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ప్రహరీ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న కంపెనీ కూడా కోహినూర్ కాదు. అలాంటప్పుడు ఆదిబట్ల పోలీసులు ధ్రువీకరించిన కోహినూర్ అనే నిర్మాణ కంపెనీ ఆ భూముల్లో ఎందుకు తిష్ఠ వేసింది? సదరు కంపెనీకి చెందిన ప్రతినిధి ఫోన్ చేయగానే పోలీసులు క్షణాల్లో వెళ్లి కేసులు నమోదు చేయడం వెనుక ఆంతర్యమేమిటి? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.