సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పట్టపగలే ..ఓ దుండగుడు ఇద్దరు వృద్ధ మహిళలను కారులో ఎక్కించుకొని.. కిడ్నాప్ చేయడంతో పాటు దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. నిత్యం వందలాదిమంది పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు.. అడుగడుగునా నిఘా నేత్రాలు..ఎటు చూసినా భారీ భద్రతా బలగాల మధ్య సీఎం కాన్వాయ్ వెళ్లే రోడ్డులోనే ఏకంగా తన కారులో వృద్ధ మహిళలను తీసుకువెళ్లిన నిందితుడు.. హత్య చేయడం భయాందోళనకు గురిచేసింది. హత్యలు చేసిన తర్వాత తనకు ఏమీ తెలియనట్లు మళ్లీ రోజువారీ తన డ్యూటీలో నిమగ్నమవుతున్నా.. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు కూడా అతనే హంతకుడు అని ఎవరూ ఊహించలేదు. రెండు కమిషనరేట్ల పరిధిలో సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతాలు ప్రస్తుతం పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నాయి. హత్యలు జరిగిన తర్వాత వచ్చిన ఫిర్యాదులపై పది రోజుల తర్వాత కానీ నిందితుడిని గుర్తించలేని పరిస్థితి. సీఎం ఇంటికి సమీపంలో ఘటన జరగడంతో నిఘా వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి.
– బంజారాహిల్స్, మార్చి 30
బంజారాహిల్స్, మార్చి 30: జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి అతి సమీపంలో ఉన్న ప్రాంతం నుంచి వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఇద్దరు వృద్ధ మహిళలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేయడంతో పాటు వారిని దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించాయి. నిత్యం వందలాది మంది పోలీసుల బందోబస్తు.. అడుగడుగునా నిఘా నేత్రాలు.. ఎటు చూసినా భారీ భద్రతా బలగాల మధ్య సీఎం కాన్వాయ్ వెళ్లే రోడ్డులోనే ఏకంగా తన కారులో వృద్ధురాళ్లను తీసుకెళ్లి హత్య చేయడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
హత్యలు చేసిన తర్వాత తనకేమీ తెలియనట్లు మళ్లీ రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకూ ఇతనే హంతకుడు అని ఆయనతో పాటు పనిచేసిన వారు కానీ, ఇతరులు కానీ ఊహించలేదు. రెండు కమిషనరేట్ల పరిధిలో సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతాలు ప్రస్తుతం పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నాయి. ఒకవైపు సీఎం ఇంటికి సమీపంలో జరగడం, నిఘా వైఫల్యం, హత్యలు జరిగిన తర్వాత వచ్చిన ఫిర్యాదులపై పదిరోజుల తర్వాత కానీ నిందితుడిని గుర్తించలేని పరిస్థితి.. ఇదంతా సాక్షాత్తు హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం ఏరియాలోనే జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మిస్సింగ్ కేసులు నమోదు
ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన సీహెచ్. మంగమ్మ (56) భర్త చాలాకాలం కిందటే చనిపోయాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 44ఏలో ఫార్మా సంస్థ అధినేతకు చెందిన ఇంట్లో బట్టలు ఉతుకుతుంది. ఆమె పెంపుడు కొడుకు సాయిబాబు కొంపల్లిలో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటాడు. కాగా ఈనెల 14న యజమాని వద్ద నుంచి రూ.16వేల జీతం తీసుకుని బయటకు వచ్చిన మంగమ్మ అదృశ్యమైంది. మరుసటిరోజు సాయంత్రం 7గంటల ప్రాంతంలో కొడుకు సాయిబాబు తనతల్లి అదృశ్యంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిలింనగర్లో నివాసం ఉంటు న్న బోయినపల్లి యాదమ్మ (70) ఇండ్లలో, ఫంక్షన్లలో వంట పని చేస్తుంటుంది. కుటుంబసభ్యులు దూరంగా ఉండడంతో ఒంటరిగా నివా సం ఉంటున్న యాదమ్మ సొదరి కుమార్తె జూబ్లీహిల్స్ రోడ్ నెం 44ఏలో నివాసం ఉంటున్న ఓ వైద్యుడి ఇంట్లో పనిమనిషిగా చేస్తుంటుంది. కాగా తనతల్లి యాదమ్మ గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ ఆమె కుమారుడు రామకృష్ణ ఈనెల 20న ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
నిందితుడు పనిచేస్తున్న చోటు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి కేవలం 250 మీటర్ల దూరంలోనే ఉంది. ఇద్దరు వృద్ధురాళ్లను రోడ్ నెం 44లోనే వేర్వేరు రోజుల్లో తన కారులో ఎక్కించుకుని, నిమిషాల వ్యవధిలోనే తాడు గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు పక్కా అధారాలు సేకరించారు. నిత్యం వందలాదిమంది పోలీసులు, వీఐపీల రాకపోకలు సాగించే రహదారిలో ఆ వృద్ధురాళ్లను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసి ఆభరణాలు దోచుకోవడమే కాకుండా.. సుమారు 15కిలోమీటర్ల దూరం ప్రయాణించి మృతదేహాలను పడేసినట్లుగా నిందితుడు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం.
వృద్ధురాలు అదృశ్యంపై ఫిర్యాదు అందినా పోలీసులు కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించడం మినహా కేసును పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా నిందితుడి భార్య కూకట్‌పల్లిలో ఉద్యోగం చేస్తుండేదని, ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు హత్య కేసుల వ్యవహారం కేవలం బంగారం కోసమే జరిగిందా.. లేక వృద్ధులే టార్గెట్‌గా హత్యలు చేశాడా? అనే కోణంలో పోలీసులు విచాణ జరుపుతున్నారు. అందులోనూ తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఇంకా ఏమైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలా చంపేశాడు!
జూబ్లీహిల్స్, ఫిలింనగర్ పీఎస్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు వృద్ధురాళ్ల కేసులను దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. ఫిలింనగర్‌కు చెందిన యాదమ్మను యాక్టివా బైక్‌మీద ఎక్కించుకుని జూబ్లీహిల్స్ రోడ్ నెం.44నుంచి వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలు సేకరించిన పోలీసులు అతడి గురించి ఆరా తీశారు. దర్యాప్తులో భాగంగా పలు పీఎస్‌ల పరిధిలో నమోదైన కేసులను పరిశీలిస్తున్న క్రమంలో నార్సింగి పీఎస్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో గ్రేహౌండ్స్ కార్యాలయం సమీపంలో ఈనెల 14న ఉదయం 11.30 ప్రాంతంలో పొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు తేలింది.
అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయించి జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా అంత్యక్రియలు చేయించినట్లు తేలిసింది. మృతదేహంపై లభించిన చీరతో పాటు ఇతర వస్తువుల ఆధారంగా మృతురాలు ఫిలింనగర్‌కు చెందిన యాదమ్మ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఫిలింనగర్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 44లో ఓ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న కే.సాయివాసు(29) ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 44నుంచి రోడ్ నెం 45కు వెళ్లే రోడ్డుపై నిర్మానుష్యంగా ఉన్నచోట హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. దీంతో అతడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు విచారించగా యాదమ్మను ఈనెల 11న సాయంత్రం ఇంటివద్ద దింపేస్తానని కొంత దూరం బైక్ మీద ఎక్కించుకున్న వాసు అక్కడినుంచి కారులో తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో హత్య చేసి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపక్కన మృతదేహాన్ని పాడేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.
అదే విధంగా ఈనెల 14న ఉదయం 11.30 ప్రాంతంలో తన ఇంటి ముందు ఉన్న బంగ్లాలో బట్టలు ఉతికే సీహెచ్.మంగమ్మను కారులో ఎక్కించుకున్న కాసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో హత్యచేసి, మోకిలా పీఎస్ పరిధిలోని ఒట్టి నాగులపల్లి నుంచి కొల్లూరు వైపు వెళ్లే ఓఆర్ఆర్ పక్కన మృతదేహాన్ని పాడేసినట్లు నిందితుడు వాసు వెల్లడించినట్లు తెలిసింది. తాను బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా అప్పులు చేశానని, ఇద్దరు వృద్ధులను చంపేసి వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నానని వాసు చెప్పినట్లుగా తెలుస్తున్నది. అయితే అతడు చెబుతున్న విషయాలకు, జరిగిన ఉదంతాలకు పొంతన లేకపోవడం, కేవలం 30నుంచి రూ.50వేల బంగారం కోసం హత్య చేశానని చెప్పడం నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు అనుమానంతో మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు.