సూర్యాపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట మున్సిపాలిటీలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయాజాలాన్ని తలపించింది. ఫేక్ ఆదాయంతో పాలకవర్గం పట్టణ ప్రజలకు అభివృద్ధిపై భ్రమలు కల్పించి నట్టేటా ముంచే ప్రయత్నం చేసిందే తప్ప మరోటి లేదనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా బడ్జెట్ రూప కల్పనలో ప్లాన్, నాన్‌ప్లాన్ నిధులు ఉంటాయి. ప్లాన్‌లో ఖచ్చితంగా వచ్చే నిధులను చూపుతుండగా నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద పురపాలకానికి వచ్చే నిధుల ఇమాజినేషన్ అంచనాలో ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ప్లాన్ గ్రాంట్ నిధులను ఎలా రూపొందించారో అర్థం కావడం లేదని పలువురు కౌన్సిలర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రూ.కోట్ల తేడాతో అంచనా బడ్జెట్..
మున్సిపల్ బడ్జెట్ సందర్భంగా మొత్తం 107.30 కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అయితే అందులో దాదాపు రూ.47 కోట్లు ప్లాన్ గ్రాంట్ చూపించగా మిగిలినవి నాన్‌ప్లాన్ కింద చూపించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలును గాలికి వదిలేయడం, ప్రభుత్వానికి అప్పు పుట్టట్లేదు, చిల్లిగవ్వ లేదని నిత్యం ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వింటూనే ఉన్నాం. అలాంటిది అంచనా బడ్జెట్ అనేది కొంతమేర తేడా ఉండొచ్చు కానీ కోట్లకు కోట్లు తేడా ఉండదని ఓ ఆర్థిక నిపుణుడు చెబుతున్నారు. రూ.47 కోట్ల ప్లాన్ గ్రాంట్లలో రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.6 కోట్లు వస్తాయని చెప్పారు.
కానీ గత రెండేళ్లలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కొంతమేర రాగా ఎస్ఎఫ్సీ నుంచి నయాపైసా రాలేదు వస్తుందన్న గ్యారంటీ కూడా అసలే లేదు. ఇక ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను రూ.90 లక్షలుగా చూపించగా గతేడాది ఒక్క రూపాయి కూడా రాకపోగా ఖర్చు ఎక్కడా పెట్టలేదనేది సుస్పష్టం. అలాగే ఈ సారి కూడా వస్తాయనే నమ్మకం లేదు. కాగా గత బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి రెండు సార్లు టప్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఇన్ప్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్) రుణాలు తేగా నేడు మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఉండడంతో బడ్జెట్లో చూపించినరూ. 8 కోట్లు వస్తాయా అనేది ప్రశ్నార్థకం. వీటితో పాటు సీఎం సూర్యాపేట మున్సిపాలిటీకి ఎప్పుడు, ఎక్కడ హామీ ఇచ్చారో ఎవరికీ తెలియదు కానీ సీఎం హామీ నిధులంటూ రూ.4.50 కోట్లు గ్రాంట్ అని చూపించడం గమనార్హం. ఇప్పటి వరకు పేర్కొన్న నిధులన్నీ ప్లాన్ గ్రాంట్‌లో చూపించగా వాటికే గ్యారెంటీ లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర నిధులు రూ. 2 కోట్లుగా చూపించారు. మొత్తం మీద రూ.47 కోట్ల ప్లాన్ గ్రాంట్‌లో దాదాపు రూ.20 కోట్ల వరకు వస్తాయనేది ఖచ్చతంగా ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది.
వాస్తవ బడ్జెట్‌ను..ప్రజలముందుంచిన జగదీశ్‌రెడ్డి
గతంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎన్నో నిధులు తెప్పించి సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నిధులు లేకుండా బడ్జెట్‌ను అధికంగా చూపి పట్టణ ప్రజలను మోసం చేస్తున్నారని అలా కాకుండా వాస్తవ బడ్జెట్‌ను ప్రజల ముందు ఉంచాలన్నారు. గతంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన అభివృద్ధిని అధిగమించాలని బడ్జెట్‌ను అధికంగా చూపారని ఇది వాస్తవ బడ్జెట్ కాదని దీన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లమంతా కలిసి నిలదీస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈద ప్రవీణ్, గాలి సాయికిరణ్, పడిదల సైదులు, విజయనాయక్, తాహేర్ పాషా, బత్తుల ఝాన్సీ, సిరివెళ్ల లక్ష్మీ కాంతమ్మ, పోతురాజు ఇందుశ్రీ ఉన్నారు.
రాని నిధులను రెండింతలు చేసి చూపించారు
బడ్జెట్ మొత్తం ఎలా రూపకల్పన చేశారో ఎవరికీ అర్థం కావడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున అన్నారు. బడ్జెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్లాన్ ఆదాయం అంటే ఖచ్చితంగా వచ్చేవి పన్నులు లాంటివి ఉంటాయని కానీ ఇక్కడ వాస్తవికత లేదని అంతా మోసమేనన్నారు. రాని నిధులను రెండింతలు చేసి చూపించడం సరికాదన్నారు. బడ్జెట్ అంచనా ఎక్కువగా వేశారని వచ్చే రాబడి తక్కువగా ఉందన్నారు.
మనకు ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ రెండు రకాలుగా ఉంటుందని ప్లాన్, నాన్ ప్లాన్ ఉంటుందని ప్లాన్ అంటే మనకు తప్పకుండా వస్తుందని నాన్ ప్లాన్ అనేది వస్తే రావచ్చు రాకుంటే రాకపోవచ్చన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు అంచనా బడ్జెట్‌ను వచ్చే ఆదాయానికి 20శాతం అదనంగా వేసుకుంటారని అలా కాకుండా 100 శాతం వేసి బడ్జెట్‌ను చూపించారన్నారు. ఎస్ఎఫ్సీ నిధులను 100 శాతం అధికంగా వేయడంతో పాటు అసలు లేని ఎంపీ, ఎమ్మెల్యే నిధులను కూడా బడ్జెట్లో చూపించారని ఇదంతా ప్రజలను మోసగించడమే అన్నారు.