Bhutan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ సిటీ, ఫార్మా సిటీ, సైబర్ సిటీ, హైటెక్ సిటీ.. ఇలా ఎన్నెన్నో కొంగొత్త నగరాల గురించి తరుచూ వినే ఉంటాం. అయితే, పొరుగు దేశం భూటాన్‌లో మైండ్‌ఫుల్‌నెస్ సిటీ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. దీన్ని ఆనంద నగరంగా కూడా పిలుస్తున్నారు.
భూటాన్‌కు దక్షిణంగా భారత సరిహద్దుల్లో 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడి ప్రభుత్వం మైండ్‌ఫుల్‌నెస్ సిటీ నిర్మాణాన్ని సోమవారం ప్రారంభించింది. దీన్ని ‘గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ’ (జీఎంసీ)గా నామకరణం చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఇక్కడ ప్రత్యేక నియమాలు, నిబంధనలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక వసతులు ఉంటాయన్నారు.
ఏ కొత్త నగర నిర్మాణమైనా ప్రజల ఆవాసాలకు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులను ఉద్దేశించే జరుగుతుంది. అయితే, ఈ ఆనంద నగరం మాత్రం ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు తద్వారా సంతోషాన్ని అందించేందుకు తీసుకొస్తున్నారు. ఈ నగరంలో కాలుష్యమనేదే ఉండదు. ఎందుకంటే ఇంధనంతో నడిచే వాహనాలు ఇక్కడ అనుమతించబోరు. కర్బన ఉద్గారాలు లేని సైకిల్స్, ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి ఉంటుంది. అంతేకాదు ఔషధ మొక్కలు, పూలవనాలు, యోగాకు ప్రత్యేక కేంద్రాలు, ఉల్లాసానికి, ఆటవిడుపుకు పార్కులు, హాల్స్, ఆరోగ్యానికి అత్యుత్తమ దవాఖానలు, శారీరక దారుఢ్యానికి వెల్నెస్ సెంటర్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, మనుషుల మధ్య ఆత్మీయానుబంధాలను పెంచేందుకు పబ్లిక్ కమ్యూనిటీ యాక్టివిటీ కేంద్రాలు ఇలా అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సంప్రదాయ వ్యవసాయం, కళాపోషణ, గ్రీన్ ఎనర్జీలో కొత్త పరిశోధనలు, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, డ్రైపోర్టు, ఎయిర్పోర్ట్, వ్యాపార కార్యకలాపాలకు కూడా ఇక్కడ చోటు ఉండనుంది.
మైండ్‌ఫుల్‌నెస్ సిటీ నిర్మాణంతో కొత్త పెట్టుబడులే కాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని భూటాన్ ప్రభుత్వం తెలిపింది. దేశంలోని నిరుద్యోగాన్ని ఈ నగరం కొంతలో కొంత తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నగర నిర్మాణానికి కూడా పెట్టుబడుదారుల నుంచి నిధులను స్వీకరిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.