Delhi Blast | న్యూఢిల్లీ/శ్రీనగర్, నవంబర్ 11: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన ఉగ్ర మాడ్యుల్‌తో పుల్వామా డాక్టర్‌కు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తున్నది. ఎర్ర కోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలిపోయిన కారును డాక్టర్ ఉమర్ నబీ నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో డాక్టర్ ఉమర్తోసహా 12 మంది మరణించినట్లు వారు చెప్పారు. మంగళవారం జమ్ము కశ్మీరు పోలీసులు ఉమర్ తల్లి నుంచి డీఎన్ఏ నమూనాను సేకరించారు.
దీని ద్వారా కారు నడిపింది ఉమరా కాదా అన్న విషయాన్ని నిర్ధారించనున్నట్లు అధికారులు చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కేసును ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉగ్ర కేసులను మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉన్న ఎన్ఐఏకి ఈ కేసును అప్పగించడంతో కారు పేలుడును ఉగ్ర కుట్రగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో లింకులు ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్ నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు డాక్టర్లతోసహా 8 మందిని అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే జన సమ్మర్థంగా ఉండే ఎర్ర కోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు సంభవించడం గమనార్హం.
ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న కారు పేలిపోవడానికి అమ్మోనియం నైట్రేట్, ఇంధనం, డిటోనేటర్లు ఉపయోగించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. ఉమర్‌కు ఐ20 కారును ఇచ్చిన పుల్వామాకు చెందిన తారీఖ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, ఎన్ఐఏ, నిఘా సంస్థలకు చెందిన బృందాలు ఢిల్లీ, కశ్మీరువ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయని, కశ్మీరులో జరిగిన దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయని వారు చెప్పారు. ఈ నలుగురిలో ఇద్దరిని ఢిల్లీ పేలుడు, ఉగ్ర మాడ్యూల్లో వారి పాత్రను నిర్ధారించడానికి సంయుక్తంగా ఇంటరాగేషన్ చేస్తున్నట్లు వారు చెప్పారు.
పేలుడు జరిగిన కారును నడుపుతున్న వ్యక్తి మాస్కు ధరించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపుతున్నదని అధికారులు వెల్లడించారు. రెడ్‌ఫోర్ట్, పరిసర మార్గాలలో ఉన్న సీసీటీవీలను అనేక బృందాలు పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు. కారులో ఉమర్ ఒక్కడే ఉన్నాడని వారు తెలిపారు. పేలుడు నేపథ్యంలో ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వారు తెలిపారు. పేలుడుకు ముందు మూడుగంటలపాటు ఆ కారు సమీపంలోని పార్కింగ్ప్లేస్లో నిలిపి ఉంది. వివిధ పార్కింగ్ ప్లేస్‌లకు చెందిన ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అనుమానితులను గుర్తించేందుకు దర్యాగంజ్, పహార్గంజ్లోని వివిధ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో సోమవారం రాత్రి సోదాలు నిర్వహించినట్లు వారు చెప్పారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్‌ని మూసివేసినట్లు ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ విధించినట్లు చెప్పారు. కారు పేలుడు ఘటనలో మరణించిన వారిని ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహకు చెందిన అశోక్ కుమార్(34), ఢిల్లీకి చెందిన అమర్ కటారియా(35)గా గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
పేలుడుకు కారణమైన ఐ20 కారును నడుపుతున్న ఉమర్‌కు కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధం ఉంది. ఇతర డాక్టర్ల తరహాలోనే తాను కూడా పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఉమర్ ఉగ్ర దాడికి పాల్పడి ఉంటాడని అధికారులు చెప్పారు. దక్షిణ కశ్మీరులోని పుల్వామా జిల్లా లేత్పొరాకు చెందిన డాక్టర్ ఉమర్ తన కారులో అమ్మోనియం నైట్రేట్ తీసుకెళ్లి ఉంటాడని, ఇది ఆత్మాహుతి దాడి అయ్యే అవకాశం కూడా లేకపోలేదని వారు చెప్పారు. అయితే ఉమర్ అలాంటి వ్యక్తి కాదని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి ఉమర్ ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదని, తన చదువుపైనే దృష్టి పెట్టేవాడని చెప్పారు.