మానకొండూర్ రూరల్, నవంబర్ 26: డ్రైవర్ నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొన్నది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సమీపంలో శుక్రవారం ఓ కారు చెట్టును ఢీకొట్టగా, నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాస్‌రావు (55) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన బంధువు పెద్దకర్మ కార్యక్రమానికి సోదరులు కొప్పుల బాలాజీశ్రీధర్ (45), కొప్పుల శ్రీరాజ్ (42)తోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఇందూరి జలంధర్ (30), పెంచాల సుధాకర్‌రావుతో కలిసి మంగళవారం కారులో వెళ్లారు. గురువారం రాత్రి కరీంనగర్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో మానకొండూర్ పోలీసుస్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా ప్రమాదాన్ని వాహన దారులు గమనించలేదు. 5 గంటల ప్రాంతంలో కొందరు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా.. అప్పటికే శ్రీనివాసరావు, బాలాజీ శ్రీధర్, శ్రీరాజ్, జలంధర్ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పెంచాల సుధాకర్‌రావును దవాఖానకు తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు మృతిచెందడంపై ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.