సిద్దిపేట, మార్చి 23: ‘బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండ్లుండి కాళేశ్వరం నీళ్లను చూడలేని కబోదులు. కాళేశ్వరం నీళ్లు రావడం లేదని వాట్సాప్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎన్సాన్పల్లి ఊర చెరువు వద్దకు వస్తే తెలుస్తది. హైదరాబాద్‌లో కూర్చోని జూటా మాటలు మాట్లాడుతున్నరు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు తప్పా రైతులకు చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు తీసుకొచ్చి గుంట ఎండకుండా నీరందిస్తున్నామని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.