Patolla Karthik Reddy | బండ్లగూడ, మార్చి 3 : రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నిక రావడం ఖాయమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని స్పష్టం చేశారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కృష్ణగౌడ్ తో పాటు పలువురు యువకులు నాయకులు పెద్ద ఎత్తున కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పటోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. త్వరలో రాజేంద్రనగర్‌లో ఇతర పార్టీలకు తావు లేకుండా పోతుందని అన్నారు.
కార్తీక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం: రావుల కోల నాగరాజు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నాని పేర్కొన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్తీక్ రెడ్డిని రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.