న్యూఢిల్లీ: ఫాస్టాగ్‌ను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నది. దీనికి సంబంధించిన ఆరు నెలల ప్రయోగాత్మక పరిశీలన ప్రస్తుతం జరుగుతున్నది. ఫాస్టాగ్ ఉపయోగం కేవలం టోల్ చెల్లింపులకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రయాణంలో అవసరమైన ఇతర సదుపాయాల కోసం చెల్లింపులకు కూడా విస్తరించాలనేది ఈ మంత్రిత్వ శాఖ లక్ష్యం. దీనివల్ల డిజిటల్ మోసాల అవకాశం తగ్గుతుందని అధికారులు చెప్పారు. యూజర్స్ ఫాస్టాగ్‌ను ఓ వాలెట్‌గా వాడుకోవచ్చునన్నారు. వాలెట్‌ను ఉపయోగించినపుడు మోసాలు జరిగిన సందర్భాల్లో నష్టం కనిష్ట స్థాయికి తగ్గుతుందని చెప్పారు.
ఏయే సేవల కోసం ఉపయోగించుకోవచ్చు?
ఫిన్‌టెక్ కంపెనీలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు, టోల్ ఆపరేటర్ల సమావేశం ఇప్పటికే జరిగింది. టోల్, పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్, ఫుడ్ ఔట్లెట్, వెహికిల్ మెయింటెనెన్స్, సిటీ ఎంట్రీ ఛార్జ్, ప్రయాణ సమయంలో ఇతర సదుపాయాలకు చెల్లింపులను ఫాస్టాగ్ ద్వారా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని అంగీకారం కుదిరింది.