జూలూరుపాడు, మే 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును, కూలీల హాజరును వారు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని, ఉష్ణోగ్రతలు సైతం రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు చేరుకుంటున్న తరుణంలో కూలీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పనులకు వచ్చే కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశంలో నీడ సౌకర్యం కల్పించుకోవాలని సూచించారు. వినోభానగర్ పంచాయతీ పరిధి నుండి ప్రతిరోజూ సుమారు 130 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
ఉపాధి కూలీలు ఎండదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా చల్లటి మజ్జిగ, సురక్షిత మంచినీటి ప్యాకెట్లను ఏపీఓ రామారావు, సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ మండుటెండల్లో తమ ఇబ్బందులను గుర్తించి, సకాలంలో స్పందించి మజ్జిగ పంపిణీ చేయడం పట్ల ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు. తమ దాహార్తిని తీర్చినందుకు గాను సర్పంచ్ నవీన్ గంగావత్కు, ఉపాధి హామీ అధికారులకు కూలీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.