BRSV | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): విద్యా రంగ సమస్యలపై పోరాటాలు చేసేందుకు బీఆర్ఎస్వీ సన్నద్ధం అవుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల విద్యార్థి విభాగాల బాధ్యులతోపాటు నియోజకవర్గానికి కనీసం 10 మంది విద్యార్థి నాయకులతో తెలంగాణభవన్ వేదికగా ప్రతినిధుల సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సమావేశానికి సంబంధించిన తేదీలను రెండు రోజుల్లో వెల్లడిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
అన్నిస్థాయిల్లో విద్యా సంస్థలను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని, రోజుకోచోట గురుకులాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శమని ఉదహరిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పదేండ్లలో 662 గురుకులాలను ప్రారంభించడమే కాకుండా దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 75 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసిన విషయాన్ని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న తీరును ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు చేరేలా కార్యాచరణను రూపొందిస్తున్నది. గురుకులాల్లో అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల సమీకృతంగా సాధన చేస్తున్నారనే అంశం మంత్రులకు తెలియకపోవడం విడ్డూరమని బీఆర్ఎస్వీ నేతలు విమర్శిస్తున్నారు.