Banswada | బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఇవాళ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానికంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై చర్చించారు.
బాన్సువాడ నియోజకవర్గం గులాబీ జెండాకు కోటని, ప్రజల తీర్పును, పార్టీ కార్యకర్తల శ్రమను వంచించి తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఒంటరిగా మిగిలారని పార్టీ నేతలు కేటీఆర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా గత 20 నెలలుగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం బాన్సువాడలో విజయవంతంగా కొనసాగుతున్నదని, గ్రామగ్రామాన గులాబీ పార్టీతో నిలబడిన కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందని, దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో మంచి విజయాలు సాధించేలా అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బాన్సువాడ నుంచి వచ్చిన కామారెడ్డి జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జుబేర్, నాయిని పద్మ మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.