(జగిత్యాల నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): భారీ తుఫాన్ సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా? అంటే సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అవుననే సమాధానం చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు పనిచేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ధిక్కారకవి అలిశెట్టి ప్రభాకర్ కవితా పాదాలతో తన ప్రసంగం ప్రారంభించారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, ప్రశాంతంగా కథ చెప్పినట్టు చెప్పారు. సందర్భానుసారం ఛలోక్తులు విసిరారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు వంచనకు గురయ్యాయని ఆవేదన చెందారు. ఈ పాలకులు ఏ వర్గానికి మేలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రజా చైతన్యాన్ని ప్రోది చేసినట్టే.. సోమవారం జగిత్యాల సభలో ప్రజలు మోసపోతున్న వైనాన్ని కండ్ల ముందు ఉంచారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు జరిగిన ప్రయోజనాన్ని గుర్తుచేస్తూ, ఈ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆ వర్గాలు పడుతున్న అరిగోసను కేసీఆర్ కండ్ల ముందు ఉంచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ‘కొత్త కుండలో ఈగ చొచ్చినట్టు’ పరిస్థితులు ఉన్నా, అన్ని రంగాలను అద్వితీయంగా ముందుకు తీసుకుపోయామని చెప్పారు. ‘కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క రాష్ర్టాన్ని వాళ్ల చేతిలో పెడితే ఆగం చేస్తున్నరు’ అని ఆయన ఒక్కొక్కరంగం పడుతున్న గోస వివరించారు. ‘మిషన్ భగీరథకు నీళ్లు ఇవ్వడానికి ఏం రోగం? 20వేల మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తెస్తే ఏ రోగం కరెంట్ ఇయ్యనీకి? కరెంట్‌ను కాకి ఎత్తుకొని పోయిందా? దరిద్రులకు రాజ్యం అప్పగిస్తే సక్కగ ఇయ్యనీకి ఏం రోగం?’ అని ధర్మాగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకుంటే ‘లాగులు పలిగేదాకా సంపాలె’ అని నిప్పులు చెరిగారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను అరిగోసలను విడమరచి చెప్పారు. ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసను కండ్లముందు ఆవిష్కరించారు. 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమాన్ని ఏకరువు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్, టీడీపీ పాలన తెలంగాణకు ఎలా శాపంగా మా రింది? మహబూబ్‌నగర్ జిల్లాలో గంజి కేంద్రాల దైన్యస్థితిని కేసీఆర్ వివరించే సమయంలో ఆయన స్వరం గద్గదమైంది.
మోసపోతే గోసపడ్తమని ఎన్నికల సమయంలో తాను చెప్పిందే నిజమైందని కేసీఆర్ ఆవేదన చెందారు. ‘అట్లనే అయిందా.. అన్నా..’ అంటే సభికుల ‘ఔనూ..ఔనూ’ అని బదులిచ్చారు. మన టైమ్‌లో బంగారం లెక్క ఉన్న తెలంగాణ ‘కాకికి కంకెడు మెతుకుల్లెవ్వు.. పిట్టకు పిడికెడు బియ్యంలెవ్వు’, పల్లె ప్రకృతి వనాలకు మనం ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోసిచ్చే తెలివిలేదా? ఏ రోగం? ఏ బాధ? అని నిప్పులు చెరిగారు. యూరియా కోసం క్యూ కడుతున్న రైతుల గోస, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, ఆటో కార్మికులు, బీడీ కార్మికులు ఇలా అన్నివర్గాలను బీఆర్ఎస్ హయాంలో ఆదుకున్న తీరును కేసీఆర్ అంశాల వారీగా వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గాలేదని, ఆయన ఇంటికే పరిమితం అవుతారని సీఎం రేవంత్‌రెడ్డి సహా సమస్త కాంగ్రెస్ నాయకగణం చేసిన దుష్ర్పచారాన్ని కేసీఆర్ పటాపంచెలు చేశారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ సాక్షిగా తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాననే విషయాన్ని తనచేతల ద్వారా, తన మాటల ద్వారా మరోసారి స్పష్టం చేశారు. సభలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.