హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు తథ్యమని, గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి యూసఫ్‌గూడ డివిజన్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళిపై వారికి దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాన్ని అన్నింటా ముందునిలిపి విశ్వవ్యాప్తం చేసిన కేసీఆర్ వైపు అన్నివర్గాల ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టంచేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో అన్నివర్గాలు దగా పడ్డాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ సర్కార్.. దగా చేసిందని దుయ్యబట్టారు.
రూ.12 వేల భృతి ఇవ్వక ఆటోడ్రైవర్లు, యూరియా అందక అన్నదాతలు, జాబ్ క్యాలెండర్ రాక నిరుద్యోగులు, పింఛన్లు పెంచక వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. వారంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రగిలిపోతున్నారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిష్‌కుమార్ యాదవ్, మంగళారపు లక్ష్మణ్, పుస్తె శ్రీకాంత్, వాసాల వెంకటేశ్, గుండ్లపల్లి శేషగిరిరావు, జెన్నాయికోడే జగన్మోహన్, పర్వతం సతీశ్, కోట్ల వినోద్‌కుమార్, పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.