హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) మార్గంలో జ హీరాబాద్ స్టేషన్‌ను చేర్చడంతోపాటు, బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో బీ ఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కే మాణిక్‌రావు, మెదక్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం శివకుమార్ గురువారం రైల్వేమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశా రు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతాల్లో జహీరాబాద్ ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రాం తంలో 12,656 ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలుపగా, ఇప్పటికే 8వేల ఎకరాల భూసేకరణ పూర్తయిందని వివరించారు. ఇండస్ట్రియ ల్ స్మార్ట్ సిటీ, డ్రైపోర్ట్, హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి మ హత్తర ప్రాజెక్టులు జహీరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఇకడ మహీంద్రా, హ్యుందాయ్ మోటర్స్, అ ల్లానా, పిరమల్ వంటి ప్రముఖ సంస్థల పరిశ్రమలు నడుస్తున్నాయని తెలిపారు.
జాతీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు తమ వ్యవసాయ భూములను స్వచ్ఛందంగా త్యాగం చేశారని, వారి త్యాగానికి ప్రతిఫలంగా ప్రపంచస్థాయి రవాణా సదుపాయాలు కల్పించాలని రైల్వేమంత్రిని కోరామని వద్దిరాజు రవిచంద్ర, జహీరాబాద్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కే మాణిక్ రావు, ఎం శివకుమార్ తెలిపారు. జహీరాబాద్‌లో హైస్పీడ్ రైల్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణతోపాటు కర్ణాటకలోని బీదర్, హుమ్నాబాద్, మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్ సరిహద్దు జిల్లాల ప్రజలకు, ఇతర పారిశ్రామిక వర్గాలకు సులభతర ప్రయాణ సౌకర్యం కల్గుతుందని పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తు లో మూడు లక్షలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, ముంబైతో బలమైన లాజిస్టిక్స్ అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.