వికారాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర సంక్షే మ పథకాలను దేశంలోనే ఎక్కడాలేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. 30 నెలల కిందట అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సంక్షేమానికి సంబంధించి ఒక్క కొత్త పథకాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురాలేదు. కొత్త పథకాలు దేవుడెరుగు.. కేసీఆర్ హయాంలో శ్రీకారం చుట్టి న పథకాలను కూడా అటకెక్కిస్తున్నది. ప్రధానం గా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీని పక్కనపెట్టేసింది. మరోవైపు గర్భిణులు, శిశువులకు గత ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ కిట్ల పథకాన్ని ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చి కూడా పంపిణీని పూర్తిగా నిలిపేసింది.
అటకెక్కిన న్యూట్రిషన్ కిట్లు..
పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ల సరఫరా గత రెండున్నరేండ్లుగా నిలిచిపోయింది. ఈ పథకాన్ని నిలిపివేయడంతో జిల్లాలో సుమారు 20 వేల మంది గర్భిణులకు సుమారు 35 వేల న్యూట్రిషన్ కిట్లు అం దలేదు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ఐదు, తొమ్మిదో నెలల్లో రెండుసార్లు రూ.2 వేలు విలువ చేసే పోషకాహారాలతో కూడిన కిట్ల ను గత కేసీఆర్ ప్రభుత్వం గర్భిణులకు అందించింది. ఆ రెండు కిలోల న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్తోపాటు కిలో ఖర్జూర, 500 గ్రాముల నెయ్యి, ఐరన్ సిరప్ రెండు బాటిళ్లు, నూలి పురుగుల నివారణ ట్యాబ్లెట్లు తదితర వస్తువులు ఉండేవి. గత 30 నెలలుగా పేద కుటుంబాలను న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో పుట్టిన బిడ్డల్లో పోషకాహార లోపం సమస్యలు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఆగిన కేసీఆర్ కిట్ల పంపిణీ..
గర్భిణులు, పుట్టబోయే శిశువుల సంరక్షణతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పథకాన్ని సక్సెస్ ఫుల్గా అమలు చేసింది. అయితే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ పథకం అటకెక్కింది. గత రెండున్నరేండ్లుగా కేసీఆర్ కిట్లతోపాటు అమ్మఒడి కింద ఇచ్చే ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు పాప పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేల ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందజేసింది.
గర్భం దాల్చిన తర్వాత నాలుగు విడతల్లో ఈ సాయాన్ని గర్భిణులకు అందించింది. అయితే ఎంసీహెచ్ కిట్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి కిట్లతోపాటు ఆర్థిక సాయాన్ని గత 30 నెలలుగా ఒక్కరికి కూ డా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు 2017 జూన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులు క్యూ కట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో 37,176 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేయ గా, అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందించింది.