నల్లగొండ ప్రతినిధి, జూలై 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవు. అందులో సగం అంటే 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే కరెంటులోనూ మధ్య మధ్యలో కోతలు పెడుతుండటంతో వ్యవసా యం ముందుకు సాగడం లేదని రైతులు రోడ్లెక్కుతున్నారు.
బుధవారం పొద్దున్నే నల్లగొండ జిల్లాలోని ఇం డ్లూరు సబ్ స్టేషన్ ఎదుట రైతులు రోడ్లెక్కి ఆందోళనకు దిగగా గురువారం గుండాల మండలం సుద్దాలలో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే కరెంటులోనూ లోఓల్టేజీకి తోడు అప్రకటిత కరెంటు కోతలు ఉండటంతో మోటార్లు సాగడం లేదని, నారు మళ్లకు నీరు పారడం లేదని రైతులు మం డిపడుతున్నారు. రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయానికి నిత్యం 18-20 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది.
కానీ సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో సూపర్ ఎల్‌నినోపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఎదుటే నల్లగొండ ఎస్ఈ మాట్లాడుతూ 14-16 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అంటే అధికారులే ఇలా చెప్తున్నారంటే ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు జిల్లాలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి కావాల్సిన అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఇతర మెటీరియల్ కూడా అందుబాటులో లేదు. ఇదే విషయమై ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలు సైతం ప్రస్తావిస్తూ డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి ఎన్నిసార్లు తెచ్చినా ఫలితం లేదని వాపోయారు.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి కరెంటు సరఫరాపై నమస్తే తెలంగాణ పరిశీలన చేపట్టింది. మండలాల వారీగా పరిస్థితి ఎంటన్నది రైతులు, ప్రజలతోపాటు అధికారుల వైపు నుంచి కూడా ఆరా తీసింది. ఈ పరిశీలనలో చాలా చోట్ల కనీసం 12 గంటలు కూడా కరెంటు వస్తున్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల 10 నుంచి 12 గంటలు మరికొన్ని చోట్ల 12-14గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు స్పష్టమైంది. దీనికి తోడు లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వస్తున్న కరెంటు కూడా పదేపదే ట్రిప్ అవుతున్నట్లు తెలిసింది. ఈ సారి వర్షాలు లేకపోవడంతో కాల్వలు రాకపోవడంతో రైతులు కూడా బోర్లు, బావులపైనే ఎక్కువగా అధారపడి సాగుకు సిద్ధపడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా అధిక లోడ్ పడుతున్నట్లు తెలిసింది.

మండలాల వారీగా పరిస్థితి ఇలా…