బెల్లంపల్లి, జూలై 23 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో 540 మంది విద్యార్థినులు ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఉడకబెట్టిన బఠానీలను అల్పాహారంగా తీసుకున్నారు. రాత్రి అన్నం, సోరకాయ కూర, పప్పుతో భోజనం చేశారు. అనంతరం 30 మంది విద్యార్థినులు కడుపువొప్పి, వికారం అవుతుందని వాంతులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని స్థానిక వంద పడకల దవాఖానకి తరలించారు.
చికిత్స అనంతరం కొంత మంది విద్యార్థినులను పాఠశాలకు తీసుకొచ్చారు. గురువారం ఉదయం కూడా మరి కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని కూడా దవాఖానకు తరలించారు. తక్కువ వాంతులు అవుతున్న విద్యార్థినులతోపాటు అలసటగా ఉన్న వారిని షంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది గురుకుల పాఠశాలలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని జిల్లా ఏరియా దవాఖానకు తరలించారు. సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా బఠానీలతో కూడిన అల్పాహారాన్ని ఇవ్వడంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తున్నది. బఠానీలను సరిగా ఉడికించపోవడం, పరిశుభ్రత పాటించకపోవడంతోనే అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరుగుతున్నది.

అధికారుల హడావుడి
వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ప్రోగ్రాం అధికారి సుధాకర్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాలకు వెళ్లి వంట గదులను పరిశీలించారు. భోజనశాల స్టోర్ రూమ్‌లోని ఆహార పదార్థాలు, బియ్యం, పప్పు, కూరగాయలు, గుడ్లను పరీక్షించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసురామ్, ఏపీడీ మాలజిస్ట్ సుమన్ ఆధ్వర్యంలో ఆహారపదార్ధాలు, నీటి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపించారు.
ఆర్బీఎస్కే వైద్య బృందం, షంషీర్‌నగర్ వైద్యాధికారి సుచరిత ఆధ్వర్యంలో రెండు రోజులపాటు గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినప్పుడు తాత్కాలికంగా హడావుడి చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ గురుకుల పాఠశాలల ఆర్సీవో శ్రీధర్, డీసీవో శిరీషలు గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజన శాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.
విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం
గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల ప్రాణాలకు ప్ర భుత్వం రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రా వణ్ విమర్శించారు. వంద పడకల దవాఖానలో చికి త్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ పూ ర్తిగా విఫలమైందనడానికి ఈ ఘటన నిదర్శనమని వి మర్శించారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలల్లో అం దించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం ఆడితే బీఆర్ఎస్వీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే విద్యార్ధుల భధ్రత కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఆయనతోపాటు పట్టణ అధ్యక్షుడు ఆడెపు అరుణ్, మాజీ అధ్యక్షుడు మురుకూరి శ్రావణ్, పట్టణ కార్యదర్శి బుద్దర్తి సుమంత్, నితీష్, రాజు ఉన్నారు.