మంచిర్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్‌రెడ్డి అండ్ కో వేసిన చిల్లర ఎత్తుగడనే 22ఏ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆరోపించారు. ఎక్కడన్నా 1.24 కోట్ల ఎకరాల నిషేధిత భూములు ఉంటాయా అని సందేహం వెలిబుచ్చారు. దేశంలో ఎక్కడా జరుగనటువంటి భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు దోచేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రజల నెత్తిన 22ఏ బాంబును మంత్రి బాంబులేటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వేశారని మండిపడ్డారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో క్యాతన్‌పల్లిలోని బాల్కసుమన్ నివాసంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ మొదలు.. మారుమూల పల్లెల దాకా అడ్డగోలుగా 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చి అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి, మార్టిగేజ్ చేసుకోడానికి పోతే.. నిషేధిత జాబితాలో ఉన్నదని చెప్పి లక్షల కోట్లు కూడబెట్టుకోవాలనే ప్లాన్ వేశారని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడబలుక్కొనే దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణికి 22ఏకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తప్పు కాంగ్రెసోళ్లు చేసి.. నెపం బీఆర్ఎస్పై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో 22ఏ బాధితుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.