హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కల్లాల్లో కన్నీళ్లతో ఉన్న రైతన్న దగ్గరికి వెళ్లి ఓటు అడగాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మరీ ఎన్నికల చేస్తున్నారే తప్ప, రాష్ట్రంలో రైతుల వద్దకు ఎందుకు రావటం లేదని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రైతుల దగ్గరికి వెళ్లాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయక తప్పించుకొని తిరగటం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసానికి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.