నమస్తే నెట్వర్క్, ఆగస్టు 17 : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసానిచ్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలులో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకే కుట్రలంటూ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తీరుపై పార్టీ కీలకనేతలు ధ్వజమెత్తారు.
మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిద్దిపేటలోని ఆర్డీవో ఆఫీస్ ఎదుట మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జడ్పీ మాజీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ మంజులా రాజనర్సు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ్‌ఖేడ్‌లో సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతిపత్రం ఇచ్చారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ రాములుకు వినతిపత్రం అందించారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, ఇల్లందు పట్టణాల్లో ధర్నాలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సిరిసిల్లలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మద్దూర్‌లో పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, పెంట్లవెల్లి బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.

హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న క్రమంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్‌స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో సెంటర్లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడలో మాజీ మంత్రి ధరంసోత్ రెడ్యానాయక్, భూపాలపల్లిలోని అంబేదర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ పథకాలపై హైకోర్టు స్టే విధించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ పథకాలకు సంబంధించిన జీవోలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు న్యాయస్థానం నాలుగు వారాల గడువు ఇచ్చినా, సరారు స్పందించకపోవడం దారుణమని ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. లబ్ధిదారులకు అందాల్సిన సాయా న్ని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పథకాలను చట్టబద్ధంగా సమర్థించకుండా తాత్సారం చేయడం వెనుక వీటిని ఎత్తివేసే దురుద్దేశం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డల పెండ్లిళ్లకు పారదర్శకంగా రూ. 13,484.69 కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత బీఆర్ఎస్దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైన తన ఉదాసీనతను వీడి, పేదల ప్రయోజనాల కోసం కోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఆయన కోరారు. నిలిచిపోయిన దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిషరించి, అర్హులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేదంటే పేదల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు వంటి పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా రెండు పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయటం లేదని ప్రశ్నించారు. వచ్చే విచారణలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తామని
ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్‌స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ప్లకార్డును ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ , మహిళలు

వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండలో నిరసన అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ తదితరులు

మెదక్ జిల్లా చిలిపిచెడ్ తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, శ్రేణులు

మెదక్‌లోని హెడ్పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు

నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, తదితరులు