హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ‘ఎల్ నినో ప్రభావం వల్ల వానలు లేవు. గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తరు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి, ప్రాణహిత జలాలను దిగువన ఏపీకి పారకం పెట్టి ఇప్పుడు ఆ నెపాన్ని కరువుపై వేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన గోదావరిలో ఎస్సారెస్పీ ఎగువ నుంచి, దాని దిగువన ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం వరకు నిజంగానే ఎక్కడా వరద ప్రవాహం లేదు. కానీ ఆ బరాజ్‌ల దిగువన మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి ఇప్పటికీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. వివరంగా చెప్పాలంటే 11 టీఎంసీల ప్రవాహం. అయినా వరద లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు వల్లెవేశారు.
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎత్తిచూపారు. మేడిగడ్డ వద్ద జలాలు వృథాగా పోతున్నాయని, అక్కడ బరాజ్ వినియోగంలో లేకున్నా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నదని తేల్చిచెప్పారు. ప్రాణహిత జలాలు లక్ష క్యూసెక్కులకు పైగా పారుతూ దిగువ ఏపీ వైపు తరలిపోతున్నాయి. అందులో 50 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు. ప్రాణహిత నీటిని వదిలేసి గోదావరిలో వరద లేదని సీఎం రేవంత్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత పరిస్థితిని ఆధారాలతో చూపినా కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అసందర్భ వ్యాఖ్యలు చేశారు.
మొత్తంగా ఇప్పటివరకు ప్రాణహిత నుంచి జూలై 3వ తేదీ నాటికే దాదాపు 25 టీఎంసీల జలాలు దిగువకు తరలిపోయాయి. మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండానే వరద ఎత్తిపోయవచ్చు. ప్రాణహిత వరద 50 వేల క్యూసెక్కులు దాటితేనే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు జలాలు చేరుకుంటాయి. ప్రస్తుతం 1.22 లక్షల ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరిలో వరద ప్రవాహం 93.5 మీటర్ల వరకు ఉంటే చాలు.. నీటిని లిఫ్ట్ చేయవచ్చు. అంటే బరాజ్‌ను ఏవిధంగానూ వినియోగించకుండానే కన్నెపల్లి నుంచి ప్రాణహిత జలాలను ఒడిసిపట్టే అవకాశమున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజుల్లో భారీ సాంకేతిక సమస్యల్లేవు. చిన్నపాటి సీపేజీలు ఉండగా, వాటిని గతంలోనే గ్రౌటింగ్ చేసి అరికట్టారు. ప్రస్తుతం ఆ బరాజ్‌లు పూర్తిగా వినియోగించుకునే స్థితిలోనే ఉన్నాయని అధికారవర్గాలే చెప్తున్నాయి. అయినా వరదే లేదు.. నీటిని ఎలా ఎత్తిపోస్తారంటూ రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారానికి తెరతీశారు.